గుండెను పిండేసి.. గాలికి వదిలేసి
చర్యలు లేకుండా
సంబరాలేంటి!
ఇరుసుమండ బ్లో అవుట్ జరిగిన సమయంలో స్థానికుల కన్నా ముందే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అరుచుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కనీసం స్థానికులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. తరువాత స్థానిక పంచాయతీ, రెవెన్యూ, పోలీసులు వచ్చి స్థానికులను హెచ్చరించి అక్కడ నుంచి ఖాళీ చేయించారు. ఐదో తేదీ మధ్యాహ్నం బ్లో అవుట్ జరిగితే రాత్రి ఆరు గంటల వరకూ కనీసం ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే పని కూడా చేపట్టలేదు. బావి నుంచి గ్యాస్, చమురు తగ్గిన తరువాత మంటలు ఆర్పిన సిబ్బంది బావి వద్ద సంబరాలు చేసుకోవడం గమనార్హం. మంటలు ఆర్పడంలో వారి కృషి ఉన్నా, అసలు బ్లో అవుట్‌కు కారణమైన ప్రైవేట్ సంస్థపై చర్యలు తీసుకోకుండా ఈ సంబరాలు ఏంటని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం లక్కవరంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నిర్వహించిన సమీక్షకు ఓఎన్జీసీ, అధికారులు, డీప్ ఇండస్ట్రీస్ సంస్థ ప్రతినిధులు వస్తారని అధికారులు ప్రకటించారు. అయితే సంబంధిత అధికారులు మూసి వేసిన బావి వద్ద సంబరాలు చేసుకున్నారే తప్ప ఇక్కడకు రాలేదు.
ఫ చమురు సంస్థల కార్యకలాపాలతో
ఆందోళన
ఫ ప్రజల భద్రతకు కానరాని చర్యలు
ఫ తరచూ బ్లో అవుట్‌లు, పైపులైన్ పేలుళ్లు
ఫ బాధితులకు పరిహారం అందజేతలో మీనమేషాలు
మలికిపురం: చుట్టూ పచ్చని పైర్లు.. హోయలొలికే పంట కాలువలు.. గోదావరి అందాలు.. నదీ సంగమాలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో అందాలు కోనసీమ సొంతం. అలాంటి అందాల సీమ గుండె నిండా నిప్పులు కక్కుతోంది. ఓఎన్జీసీ బ్లో అవుట్‌లు.. గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ల పేలుళ్లతో భయాందోళన పుట్టిస్తోంది. భారీ విపత్తులు జరిగినప్పుడు చమురు సంస్థలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తున్న తీరూ విమర్శలకు తావిస్తోంది. రూ.వేల కోట్ల గ్యాస్, చమురు తరలించుకుపోతూ సామాన్యుల భద్రతను గాలికి వదిలేయడంపై జనంలో ఆగ్రహం రప్పిస్తోంది. కనీసం బాధితులకు పరిహారం ఇవ్వడంలోనూ ఇటు చమురు సంస్థలు, అటు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం బాధాకరం.
ఇటీవల మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద బ్లో అవుట్ కలకలం రేపింది. ఇందులో బాధితుల భద్రత, పరిహారం విషయంలో సరైన న్యాయం జరగలేదు. ఇళ్ల పక్కనే డ్రిల్లింగ్ జరుగుతున్న విషయం బ్లో అవుట్ ఘటన బయలకు వస్తే కాని, స్థానికులకు పూర్తిగా తెలియలేదు. జనానికి తెలియకుండా చమురు, సహజ వాయువుల కోసం డ్రిల్లింగ్‌లు చేసుకుపోతున్న ఓఎన్జీసీ ప్రజల ప్రాణాలకు భద్రత మాత్రం కల్పించడం లేదు. ఇరుసుమండలో నివాసాలకు 200 మీటర్ల సమీపంలో ఈ బావి ఉండడం, డ్రిల్లింగ్ చేస్తున్న ప్రైవేట్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా పేలుడు సంభవించడం శోచనీయం. అక్కడి నివాసాల్లో ఉన్న మహిళలు, వృద్ధులు, పిల్లలు, రోగులు, ఇలా అనేక మంది తమ ఇళ్లకు తాళాలు కూడా వేయకుండా కట్టుబట్టలతో పరుగులు తీసిన విషయం తెలిసిందే. బ్లో అవుట్ మంటలు ఆర్పి, బావి మూసినా జరిగిన ప్రమాదం వారి కళ్ల ముందే కదలాడుతోంది. అసలు బతుకు తామనుకోలేదంటూ ఆ రోజు నుంచీ బాధితులు షాక్‌లోనే ఉన్నారు. ఇంత జరిగినా బాధితులకు ఇవ్వాల్సిన పరిహారంపై అటు ఓఎన్జీసీ, ప్రైవేట్ కంపెనీ, ఇటు ప్రభుత్వం బేరసారాలు ఆడుతుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. అధికార పక్ష నేతలు కూడా బాధితుల పక్షాన గట్టిగా మాట్లాడడం లేదనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకూ ప్రజాప్రతినిధులు ఇలా ప్రజల మధ్యనే ఉన్నామని చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారే తప్ప పరిహారం మీద కిమ్మనకుండా ఉన్నారు. నాలుగు గ్రామాలకు చెందిన 630 కుటుంబాలకు రూ.పది వేల చొప్పున రూ..6.30 కోట్లు ఇస్తామన్నారు. కుటుంబానికి 50 కిలోల బియ్యం అందిస్తామన్నారు. తమకు కనీసం రూ.25 వేలైనా ఇవ్వాలని బాధితులు కోరుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద స్థానిక నాయకులు ప్రస్తావించినా స్పందన కరవైంది.
ఆ రోజు గాలే కాపాడింది
బ్లో అవుట్ సంభవించిన రోజు గాలే తమను కాపాడిందని స్థానిక ప్రజలు అంటున్నారు. తొలుత భారీగా గ్యాస్ ఉబికి ఇచ్చినప్పుడు బావికి ఉత్తర దిక్కున పంట పొలాలు, దక్షిణ దిక్కున 200 మీటర్ల లోపు నుంచి నివాసాలు ఉన్నాయి. అయితే గాలి ఉత్తర దిక్కు వైపు వీయడంతో ఉబికిన గ్యాస్ ఉత్తరం వైపు కదిలింది. దీంతో నివాస ప్రాంతాలకు దగ్గరగా వెళ్లినా నివాసాలను చేరలేదు. పైగా గ్యాస్ బయటకు వచ్చిన చాలా సమయం వరకూ పేలుడు లేకపోవడం, మంచు వల్ల గ్యాస్ నెమ్మదిగా కదలడం కూడా ప్రజలను రక్షించింది. ఒకవేళ రాత్రి వేళ జరిగి ఉంటే ప్రమాద తీవ్రత చాలా దారుణంగా ఉండేది. మరో నగరం విస్ఫోటనం అయ్యేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద ప్రమాదం జరగలేనందున తమ వైఫల్యాలను ఓఎన్జీసీ, ప్రైవేట్ సంస్థలు కప్పిపుచ్చుకుంటున్నాయి.
● డీప్ ఇండస్ట్రీస్‌పై చర్యలు
తీసుకోండి
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన డీప్ ఇండస్ట్రీస్ సంస్థపై చర్యలు తీసుకోవాలి. నివాసాల మధ్య ఇష్టానుసారంగా డ్రిల్లింగ్ చేసి బ్లో అవుట్‌కు కారణం అయ్యింది. ఆ సంస్థ ప్రజల భద్రతను కనీసం పట్టించుకోవడం లేదు. డ్రిల్లింగ్‌కు అనుమతులు, పనితీరుపై విచారణ జరపాలి. ఈ మేరకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను.
–కొడవటి దొరబాబు, రైతు, లక్కవరం
బాధితుల బాధలు చెప్పనివ్వరా
మలికిపురం మండలం ఇరుసుమండలో బ్లో అవుట్ ఘటనపై లక్కవరంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇందులో బ్లో అవుట్ బాధితుల బాధలు చెప్పుకొనే అవకాశం ఇవ్వకపోవడం దారుణం. అసలు ఈ సమావేశం ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. భయాందోళనలో ఉన్న బాధితులను ఆదుకోకపోవడం శోచనీయం. పరిహారం మొక్కుబడిగా ఇవ్వడం సరికాదు.
–మంగెన సింహాద్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు
గుండెను పిండేసి.. గాలికి వదిలేసి
గుండెను పిండేసి.. గాలికి వదిలేసి
గుండెను పిండేసి.. గాలికి వదిలేసి


