
ముద్రగడ క్షేమంగా ఉన్నారు
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం క్షేమంగా ఉన్నారని ఆయన పెద్దకుమారుడు వీర్రాఘవరావు(బాలు) తెలిపారు. ముద్రగడ ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యి విశ్రాంతి తీసుకుంటున్న విషయం విదితమే. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంతో క్షేమంగాని ఉన్నారని, కొద్దిరోజుల పాటు హైదాబాద్‌లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటారని ఆయన పెద్ద కుమారుడు వీర్రాఘవరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి ఎంతో అవసరమని వైద్యులు సూచించారన్నారు. ఆయనను చూసేందుకు హైదరాబాద్ ఎవరు వెళ్లొద్దని ఆయన కోరారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన జనం ముందుకు వస్తారని తెలిపారు.
ఎంపీడీఓలు పీసా చట్టంపై కలిగి ఉండాలి
సామర్లకోట: ఎంపీడీఓలు పంచాయతీల విస్తరణ చట్టం (పీసా)పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఈటీసీ సీనియర్ ఫ్యాకల్టీ ఎ.రవిశంకర్ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 జిల్లాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు ఐదవ రోజు పీసా చట్టంపై శిక్షణ నిర్వహించారు. రవిశంకర్ మాట్లాడుతూ ఈ చట్టాన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలకు చెందినవారి కోసం 1996లో అమలులోకి తీసుకు వచ్చారన్నారు. ఈ చట్టం షెడ్యూల్డ్ తెగల ప్రజల సంప్రదాయ హక్కులను పరిరక్షించడం, స్వయం పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వడం కోసం ప్రవేశపెట్టారన్నారు. ఈ చట్టంపై అవగాహన కల్పించడానికి వారి గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జార్జాండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లో అమలు చేస్తున్నారని వివరించారు. పంచాయతీలకు సంబంధించి రాజ్యాంగంలోని కొన్ని హక్కులను షెడ్యూల్డు ప్రాంతాలకు విస్తరించారని చెప్పారు. గిరిజన జనాభాలో ఎక్కువ మందికి స్వయం పాలన కల్పించాలన్నారు. వారి ఆస్తులను పరిరక్షించవలసిన బాధ్యత ఎంపీడీఓలపై ఉంటుందని తెలిపారు. మరో ఫ్యాకల్టీ కేఆర్ నిహరిక పీసా చట్టం పై క్విజ్ పోటీలను నిర్వహించారు.