
అద్భుతం.. అభినయ విన్యాసం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నర్తన రుషి డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ శిష్యులచే నవజనార్దన పారిజాతం ఆలయ నృత్య ప్రదర్శన అద్భుతంగా జరిగింది. శ్రీ సద్గురు సన్నిధి నిర్వహణలో శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. తొలుత జి.రిషిక, శాన్విక, రూపాశ్రీలు వినాయక కౌతం, అన్నమయ్య కీర్తనలకు చూడముచ్చటగా నర్తించారు. ముగ్గురూ తొలి ప్రదర్శనలోనే ప్రేక్షకులను అలరించేలా నర్తించారు. గోదావరి తీరాన వెలసిన నవ జనార్దన స్వామి ఆలయంలో ప్రాచీన కాలంలో ఊపిరి పోసుకుని, ప్రపంచంలోనే అతి పెద్ద నాట్య ప్రక్రియగా ప్రసిద్ధి పొందిన నవజనార్దన పారిజాతం, భామాకలాపాన్ని అంకిత ఐశ్వర్య, ఆరుషి దుర్గాంబిక, భానుదుర్గ, నవ్యశ్రీ, నయనికలు చక్కగా ప్రదర్శించారు. ఈ ఐదుగురూ సత్యభామలనే తలపించారు. సత్యభామలోని ధీరత్వాన్ని, గర్వాన్ని, దుఃఖాన్ని ఇలా నవరసాలను అద్భుతంగా అభినయిస్తూ ఉత్తేజంగా నర్తించారు. సప్పా దుర్గాప్రసాద్ నవజనార్దన పారిజాత భామాకలాపంలో తన పాండిత్యాన్ని చూపించారు. ఈ అద్భుత అభినయాన్ని ప్రేక్షకులు తన్మయంతో తిలకించి కరతాళధ్వనులతో అభినందించారు. నర్తకిలను సద్గురు సన్నిధి వ్యవస్థాపకుడు శిష్టు మధుసూదనరావు తదితర ప్రముఖులు సత్కరించారు. సప్పా దుర్గా ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.
నృత్యం చేస్తున్న నర్తకీమణులు