
అన్ని దారులూ వాడపల్లికే..
● భక్తులతో కిక్కిరిసిన వెంకన్న క్షేత్రం
● ఒక్క రోజే రూ.6.70 లక్షల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కిక్కిరిసింది. శనివారం ఇసుక వేస్తే రాలనంత రీతిలో భక్తులు తరలిరాగా ఆ జనంలో ప్రదక్షిణలు చేయలేని భక్తులు ఇతర వారాల్లో ఏదో ఒక రోజు నిర్ణయించుకుని ఏడు ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం’ నానుడితో అశేష భక్తజనం తరలి రావడంతో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్రం నలుమూలల నుంచీ అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా, మిగిలిన ఆరు రోజులూ అత్యధికంగా వస్తున్నారు. దానితో ఈ క్షేత్రం శనివారాలే కాకుండా వారంలో మిగిలిన రోజుల్లో కూడా నిత్య కల్యాణం పచ్చతోరణంలా మారుతోంది. ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు ఆదివారం అష్టోత్తర పూజ, స్వామివారి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యాన సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఒక్క రోజే దేవస్థానానికి రూ.6,70,313 ఆదాయం వచ్చిందని చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో విశాఖపట్నం కళారాధన నృత్య కళాశాలకు చెందిన కళాకారిణులతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
నేటి నుంచి పవిత్రోత్సవాలు
వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈఓ సూర్యచక్రధరరావు తెలిపారు. సోమవారం ఉదయం రుత్విక్కులు దీక్షాధారణ, అకల్మష హోమం నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, పవిత్ర ప్రతిష్ఠ పూజలు చేయనున్నారు. ఐదో తేదీ ఉదయం అష్ట కలశ స్థాపన, మహాశాంతి హోమం, ఆరో తేదీ ఉదయం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి నిర్వహిస్తారని ఈఓ వివరించారు.

అన్ని దారులూ వాడపల్లికే..