
నిలకడగా పొగాకు ధర
● కిలోకు గరిష్టంగా రూ.370
● 41.88 మిలియన్ కిలోల విక్రయాలు
దేవరపల్లి: మార్కెట్లో వర్జీనియా పొగాకు ధర వారం రోజులుగా నిలకడగా కొనసాగుతోంది. గత నెల 26 వరకూ కిలో గరిష్ట ధర రూ.390 ఉండగా, 27వ తేదీ నుంచి రూ.370కి తగ్గింది. వారం రోజులుగా అదే స్థాయిలో కొనసాగుతుంది. గరిష్ట ధర తగ్గినప్పటికీ సగటు ధర రూ.291.98 లభించడంతో రైతులు సంతృప్తిగా ఉన్నారు. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి సుమారు రూ.1,231 కోట్ల విలువైన 41.88 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కిలోకు గరిష్టంగా రూ.370, కనిష్టంగా రూ.200, సగటున రూ.291.98 చొప్పున ధర లభించినట్టు రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకూ 107 రోజులు వేలం నిర్వహించగా, 3,26,887 బేళ్ల విక్రయాలు జరిగాయి. ఐదు వేలం కేంద్రాలకూ ప్రతి రోజూ సుమారు 6 వేల బేళ్లు అమ్మకానికి వస్తున్నాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో 7.10 మిలియన్ కిలోలు, జంగారెడ్డిగూడెం–1లో 9.31, జంగారెడ్డిగూడెం–2లో 8.91, కొయ్యలగూడెంలో 8.45, గోపాలపురంలో 8.10 మిలియన్ కిలోల చొప్పున పొగాకు విక్రయాలు జరిగాయని ప్రసాద్ వివరించారు. దేవరపల్లి వేలం కేంద్రంలో అత్యధికంగా కిలో సగటు ధర రూ.305 లభించింది. 2024–25 పంట కాలంలో సుమారు 80 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి జరిగిందన్నది అధికారుల అంచనా కాగా, ఇప్పటి వరకూ 50 శాతం పొగాకు కొనుగోళ్లు జరిగినట్లు ప్రసాద్ తెలిపారు.
దేవరపల్లి వేలం కేంద్రానికి అమ్మకానికి వచ్చిన బేళ్లు