గురువుల మధ్య.. కూటమి కుంపటి | - | Sakshi
Sakshi News home page

గురువుల మధ్య.. కూటమి కుంపటి

Aug 4 2025 3:57 AM | Updated on Aug 4 2025 3:57 AM

గురువ

గురువుల మధ్య.. కూటమి కుంపటి

ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ పాటించాలి

ఉపాధ్యాయులందరూ డీఎస్సీ ద్వారానే నియమితులవుతారు. అలాంటప్పుడు ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ పాటించాలి. అలా కాదని జెడ్పీ టీచర్లపై వివక్ష చూపడం తగదు. సర్వీస్‌ రూల్స్‌ కారణంగా రెండు దశాబ్దాలుగా జెడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయులు వివక్షకు గురవుతున్నారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని జూనియర్లు కూడా ఎంఈఓలు అవుతారు. సీనియర్‌ జెడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయులు పదోన్నతులు కోల్పోతారు. ఇది చాలా అన్యాయం.

– కోలా సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‌

ప్రధానోపాధ్యాయ సంఘం, రాష్ట్ర సహాధ్యక్షుడు

సీనియారిటీ ప్రాతిపదికన

భర్తీ చేయాలి

ఉమ్మడి సీనియార్టీ ప్రాతిపదికన మాత్రమే ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేయాలి. ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్ల వివరాలు మాత్రమే సేకరించడం తగదు. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌కు సంబంధించిన జీఓ అమలు చేయాల్సి ఉన్నా.. పక్కన పెట్టడం తగదు.

– కేవీ రమణారావు, ఆంధ్రప్రదేశ్‌

ప్రధానోపాధ్యాయ సంఘం, జిల్లా అధ్యక్షుడు

జెడ్పీ, ప్రభుత్వ టీచర్ల మధ్య

గొడవలు పెడుతున్న సర్కారు

ఎంఈఓ పోస్టుల భర్తీలో ప్రభుత్వ

స్కూళ్ల హెచ్‌ఎంలకే ప్రాధాన్యం

జెడ్పీ హెచ్‌ఎంలకు మొండిచేయి

ప్రభుత్వ నిర్ణయంపై

ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత

సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల మధ్య విభజన కుంపటి పెట్టింది. ఎంఈఓ పోస్టుల భర్తీని అడ్డం పెట్టుకుని గురువుల మధ్య తగాదాలు పెడుతోంది. మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ యాజమాన్య స్కూళ్లలోని ప్రధానోపాధ్యాయులను పక్కన పెట్టి, కేవలం రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న అతి తక్కువ స్కూళ్లలో పని చేస్తున్న హెచ్‌ఎంలు, సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లను ఎంఈఓ–1గా నియమిస్తోంది. ఇందుకు సమ్మతి తెలపాలంటూ ప్రభుత్వ స్కూళ్ల హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లకు పాఠశాల విద్యా శాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్‌జేడీ) ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఉపాధ్యాయులకు ఆగ్రహం కలిగిస్తోంది. ప్రస్తుతం మండల విద్యా శాఖాధికారి–1(ఎంఈఓ–1)గా ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్య పాఠశాలల హెచ్‌ఎంలు పని చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకే అవకాశం కల్పించడం దుర్మార్గమని మండిపడుతున్నారు. దీనిక వెనుక విభజించి.. పాలించు అనే విధానం దాగుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువుల మధ్య గొడవలు సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వం ఈ విధానం అవలంబిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.

పదోన్నతులు వారికేనా.. మాకివ్వరా?

జిల్లావ్యాప్తంగా 203 జెడ్పీ, మున్సిపల్‌ హైస్కూళ్లలో 2,502 ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 11 ప్రభుత్వ పాఠశాలలుండగా.. వాటిలో కేవలం 173 మంది ఉపాధ్యాయులే ఉన్నారు. జెడ్పీ, మున్సిపల్‌, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల మధ్య ఇంత భారీ వ్యత్యాసం ఉన్నా.. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 173 మంది టీచర్లకు మాత్రమే పదోన్నతులు దక్కేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై స్థానిక సంస్థల పాఠశాలల్లో పని చేస్తున్న పంచాయతీరాజ్‌ (పీఆర్‌) ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. పదోన్నతులు తమకెందుకివ్వరని ప్రశ్నిస్తున్నారు.

సీనియర్లను విస్మరించి..

మరోవైపు సీనియర్‌ ఉపాధ్యాయులను ప్రభుత్వం విస్మరిస్తోంది. వారిని ఎంఈఓ–2గా నియమించి సర్వీసులో జూనియర్లయిన ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లకు ఎంఈఓ–1గా ప్రాధాన్య పోస్టులు ఇవ్వడమేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తద్వారా మెజారిటీ పీఆర్‌ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోంది. 90 శాతం ఉన్న పీఆర్‌ ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి అదే పోస్టులో ఉండిపోతున్నారు. దీనిపై వారు పోరాటాలు చేపట్టి, ప్రభుత్వం నుంచి సానుకూల ఉత్తర్వులు కూడా పొందారు. అయితే, ప్రభుత్వ ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించి ఈ ఉత్తర్వులకు బ్రేక్‌ వేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈఓ–1 పోస్టులు ఇవ్వవద్దని కోర్టు గత ఏడాది ఉత్తర్వులు ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై స్టేటస్‌ కో అమలులో ఉంది. ప్రభుత్వ, పీఆర్‌ ఉపాధ్యాయులిద్దరికీ ప్రస్తుతానికి ఎంఈఓ–1 పోస్టులు ఇవ్వరాదంటూ ఉత్తర్వులున్నాయి. కానీ, ప్రస్తుతం ఎంఈఓ, ఉప విద్యా శాఖాధికారి (డీవైఈఓ) పోస్టులను ప్రభుత్వ ఉపాధ్యాయులకే కట్టబెడుతున్నారు. కోర్టు తీర్పు ప్రకారం స్టేటస్‌కో అమలు చేయాలి. 90 శాతంగా ఉన్న పీఆర్‌ ఉపాధ్యాయులను కూడా ఎంఈఓ–1, డీవైఈఓ వంటి ఉన్నత పోస్టుల్లో నియమించాలి. ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. జెడ్పీ, మున్సిపల్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరూ జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా నియమితులైన వారే. సీనియారిటీ ప్రకారం ఎంఈఓ పోస్టులకు హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు అర్హులు. అయినప్పటికీ ప్రభుత్వం కామన్‌ రూల్స్‌ పాటించకుండా, కేవలం ప్రభుత్వ పాఠశాలల వారికే అవకాశం ఇవ్వడం ద్వారా తమపై వివక్ష చూపుతోందని ఇతర యాజమాన్య ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

గత ప్రభుత్వంలో అందరికీ అవకాశం

సర్వీస్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎం/ఎంఈఓ పోస్టు ఫీడర్‌ కేడర్‌ పోస్టుగా ఉంది. అయితే, వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ లేవు. దీని వల్ల ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకే ఎంఈఓ పోస్టులు ఇస్తున్నారు. వీటిని తమకూ ఇవ్వాలని జెడ్పీ టీచర్లు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 2023లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎంఈఓ–2 పోస్టులను సృష్టించి జెడ్పీ హెచ్‌ఎంలను నియమించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంఈఓ–2 పోస్టులను రద్దు చేసేందుకు యత్నిస్తోంది. ఖాళీలను భర్తీ చేయడం లేదు. మరోవైపు ఎంఈఓ–1 పోస్టులను కేవలం ప్రభుత్వ యాజమాన్య హెచ్‌ఎం లేదా స్కూల్‌ అసిస్టెంట్లకు మాత్రమే ఇస్తోంది. గత ఏడాది చాలా మంది ఎంఈఓ–1లు రిటైరయ్యారు. ఆ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం పక్క మండలాల వారికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తోంది. ప్రభుత్వ చర్యలను అధిక సంఖ్యలో ఉన్న జెడ్పీ టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.

చెప్తే వినరేం..!

మీకు ఎంఈఓ–1 పోస్టు ఇవ్వడం కుదరదయ్యా!

గురువుల మధ్య.. కూటమి కుంపటి1
1/2

గురువుల మధ్య.. కూటమి కుంపటి

గురువుల మధ్య.. కూటమి కుంపటి2
2/2

గురువుల మధ్య.. కూటమి కుంపటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement