
‘రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం’
రాజమహేంద్రవరం సిటీ: ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఈ నెల 5న ‘రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అనే వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్‌వర్మ తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా గిరిప్రసాద్‌వర్మ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలకు మూలాలను గుర్తించి, వాటి పరిష్కార మార్గాలను వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమని అన్నారు. ఇందులో భాగంగా ఉద్యోగుల సమస్యలపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామ సూర్యనారాయణ రూపొందించిన వీడియో, ఆడియో సందేశాలను ఉద్యోగులకు ప్రదర్శిస్తామన్నారు. ఆ సందేశాలపై ఉద్యోగులు టీ తాగుతూ చర్చించుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, నిడదవోలు, కొవ్వూరు, అనపర్తి, కోరుకొండ, రాజమహేంద్రవరం రూరల్, ధవళేశ్వరం, గోపాలపురాల్లో ఈ నెల 5న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ఎస్ విల్సన్‌పాల్, సహాధ్యక్షుడు డీఎస్ చంబర్లీన్ తదితరులు పాల్గొన్నారు.
కూటమివి కుట్రపూరిత
రాజకీయాలు
రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలతో వైఎస్సార్ సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తోందని ఆ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ విజయ సారథి ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో పాలనపై దృష్టి సారించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా ఆ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, గంజాయి మత్తులో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులపై వివక్ష చూపుతున్నారన్నారు. క్రైస్తవ సీ్త్రలని కూడా చూడకుండా ఇద్దరు నన్స్‌ను ఆధారం లేని కారణాలతో అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. క్రైస్తవులకు మేలు చేసే ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే వైఎస్సార్ సీపీ సమన్వయకర్తల సహకారంతో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని విజయ సారథి వెల్లడించారు.
రాణి సుబ్బయ్య దీక్షితులు
జీవితం ఆదర్శనీయం
కాకినాడ సిటీ: అష్టావధానులకు మార్గదర్శిగా, సాహితీ స్రష్టగా, సంస్కృత భాషాసాహిత్యాలకు విశేష సేవలందించిన రాణి సుబ్బయ్య దీక్షితులు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు అన్నా రు. బాణుడు రచించిన కాదంబరి కావ్యంపై ఆయన సాహితీ ప్రసంగం చేశారు. రాణి సుబ్బ య్య దీక్షిత, సాహితీ కౌముది ఆధ్వర్యాన సూర్య కళా మందిరం ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. కాదంబరి కావ్యంలోని అనేక పాత్రల వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. కావ్యంలో పరిపాలన చేసే రాజు, నాయికా నాయకులను వర్ణిస్తూ నేటి యువతకు ఆదర్శనీయంగా ఉండేలా ఆయన ప్రసంగం సాగింది.