
ప్రభుత్వ విధానాలతో బడులకు నష్టం
ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో బడుల్లో విద్యార్థులు తగ్గిపోయి విద్యా వ్యవస్థ చతికిలబడుతోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) అధ్యక్షుడు డేనియల్ బాబు ధ్వజమెత్తారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ వింత పోకడలపై శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన, ఆందోళన చేపట్టారు. నూతనంగా అప్‌గ్రేడ్ అయిన స్థానాలను భర్తీ చేసి, ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలన్నారు. ప్రభుత్వం పి4 నుంచి ఉపాధ్యాయులను తప్పించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు అప్పగించి బోధనా సమయాన్ని హరించవద్దని, యాప్‌ల భారం తక్షణమే తగ్గించాలని తదితర డిమాండ్లు చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కార్యదర్శి జయకర్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందచేశారు.
సమన్వయంతో పుష్కర ఏర్పాట్లు
● డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా
● రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు సెక్షన్ల తనిఖీ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): గోదావరి నదికి 2027వ సంవత్సరంలో జరగనున్న పుష్కరాల నేపథ్యంలో విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా శనివారం రాజమండ్రి–గోదావరి–కొవ్వూరు సెక్షన్‌లను సంబంధిత అధికారులతో కలసి తనిఖీలు చేశారు. పుష్కరాలకు సుమారు 40 లక్షలకు పైగా ప్రయాణికులు వస్తారనే అంచనాతో రాజమండ్రి స్టేషన్‌లోని తూర్పు, పశ్చిమ ప్రవేశ ద్వారాలు, స్టేషన్ యార్డులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పరిశీలించారు. జరుగుతున్న స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించి యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రవేశ ద్వారాలు, సర్క్యులేటింగ్ ప్రాంతాలు, ప్రజలకు అందించే సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం డీఆర్‌ఎం మాట్లాడుతూ పుష్కర యాత్రికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రద్దీని నియంత్రించేందుకు ఆయా స్టేషన్‌లలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు.
1.14 లక్షల మందికి ‘సుఖీభవ’
తాళ్లపూడి (కొవ్వూరు): రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ అందజేసినట్టు జిల్లా ఇన్‌చార్జి, జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కొవ్వూరులో లిటరరీ క్లబ్ వద్ద జరిగిన ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2025–26 మొదటి విడత నిధుల జమ కార్యక్రమంలో రామానాయుడు, కలెక్టర్ పి. ప్రశాంతి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతలో రూ.7 వేల చొప్పున జిల్లా వ్యాప్తంగా 1.14 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.79 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. కౌలు రైతులకు అక్టోబర్, జనవరిలో నిధులు జమ అవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధవళేశ్వరం గేట్ల సమస్య పరిష్కారానికి, దారవరం ముంపు సమస్యకు లిఫ్ట్ స్కీమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ సుబ్బరాజు, ఆర్డీవో రాణి సుస్మిత తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విధానాలతో బడులకు నష్టం

ప్రభుత్వ విధానాలతో బడులకు నష్టం