
తవ్వకాలను అడ్డుకున్న
గ్రామస్తులు
17 లారీలు, 4 పొక్లెయిన్ల స్వాధీనం
రాజానగరం: మండలం కలవచర్ల సమీపంలోని పోలవరం ఎడమ కాలువకు ఇరువైపులా ఉన్న మట్టి గుట్టలను అక్రమంగా తవ్వి తరలించడాన్ని కలవచర్ల గ్రామస్తుల సహకారంతో స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై గ్రామస్తులు చేసిన ఫిర్యాదుపై స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు శనివారం ఉదయం హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న 17 లారీలను, అందుకు ఉపయోగించిన 4 పొక్లెయిన్లను స్వాధీనపర్చుకున్నామని జిల్లా గనుల శాఖ అధికారి డి.ఫణిభూషణ్‌రెడ్డి తెలిపారు. స్వాధీన పరచుకున్న వాహనాలను రాజానగరం పోలీసు స్టేషనుకు తరలించామన్నారు. అలాగే మట్టి తవ్వకాలు జరుగుతున్న మరో మూడు ప్రదేశాలలోను తనిఖీలు చేశారు. జరిగిన మట్టి తవ్వకాలను కొలతలు తీసుకుని, చట్ట ప్రకారం తదుపరి చర్యల కోసం నివేదికలు తయారుచేస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దారు జీఏఎస్‌ఎల్ దేవి, ఆర్‌ఐ రంభ, ఇరిగేషన్ డీఈ డి.మోహన్‌రావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.