
చంద్రబాబు మోసాలను గ్రామస్థాయిలో వివరించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ
రాజమహేంద్రవరం రూరల్: బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ, మండల స్థాయిల్లో నిర్వహించామని, ఇప్పుడు గ్రామస్థాయికి వెళ్లి ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాసిచ్చిన బాండ్ల గురించి నిలదీయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ అబద్ధ్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ నిధులను గత ఏడాది ఎగవేసిందని తెలిపారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఉచిత బస్సు హామీలపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లపైనా మాట్లాడడం లేదని వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో భర్త చనిపోయిన వెంటనే వితంతు పింఛన్ ఇచ్చారని, రైతు భరోసా ఐదేళ్లు, పంటకు గిట్టుబాటు ధర, నాణ్యమైన విత్తనాలు, అందుబాటులో ఎరువులు ఉంచారన్నారు. కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలేక రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీల ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారన్నారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, జనసేన నేత కరాటం రాంబాబు ఆడియోలీక్‌లో పోలవరం జనసేన ఎమ్మెల్యే రూ.100 కోట్లు ఎలా దోచుకున్నాడో తేలిందన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులంతా నిత్యం ప్రజల్లో ఉంటూ తమకు ఇచ్చిన పదవులకు న్యాయం చేసేలా సమష్టి కృషితో జగన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు, జిల్లా కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.