
నీరు లేక నెర్రెలు..
బోర్లు పని చేయడం లేదు
ఆవ చెరువులో నీరు లేక బోర్లు పనిచేయడంలేదు. భూమిలో నీటిమట్టం తగ్గడంతో బోర్లు తక్కువ నీరు తోడుతున్నాయి. బోరు నీరు చేలకు సరిపోవడంలేదు. ఆయకట్టు రైతుల బాధలు వర్ణనాతీతం. చెరువు నిండితే భూగర్భ జలాలు పెరిగి బోర్లు ఎక్కువ నీటిని తోడతాయి. నీరు లేక ఆవ చెరువు ఎండిపోయింది. వరి చేలకు తడి సరిపోవడంలేదు. చెరువు కింద 10 ఎకరాలలో వరి పంట వేశాను. నీరు లేక చేలు దెబ్బతింటున్నాయి. వాతావరణం ఇలాగే ఉంటే ఖరీఫ్ సాగు కష్టమే.
– గంటా ఏడుకొండలు, రైతు,
త్యాజంపూడి, దేవరపల్లి మండలం
తాడిపూడి నీరు అవసరం
తాడిపూడి కాలువ నీటి అవసరం ఉంది. యర్నగూడెం వద్ద కాలువకు గతంలో ఏర్పాటు చేసిన ప్రదేశంలో సిమెంట్ తూరలు ఏర్పాటు చేసి ఆవ చెరువకు నీటి సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలి. వాతావరణం ఇలానే ఉంటే వరి చేలు నెర్రెలు తీస్తాయి. మూనలు ఎండిపోతున్నాయి. త్యాజంపూడి, కురుకూరు గ్రామాలకు చెందిన భూములు సుమారు 1800 ఎకరాలు ఆయకట్టులో ఉన్నాయి. రైతుల ఇబ్బందులను అధికారులు గమనించి తక్షణం నీటి సరఫరాకు చర్యలు చేపట్టి పంటలను కాపాడాలి.
– పల్లి రత్నారెడ్డి, అధ్యక్షులు,
వైఎస్సార్ సీపీ, మండల రైతు విభాగం
దేవరపల్లి మండలం త్యాజంపూడిలోని ఆవ చెరువు
● ఆవ చెరువులో నిండుకున్న నీరు
● అడుగంటిన భూగర్భ జలాలు
● 1,800 ఎకరాల ఆయకట్టుకు నీటి ఎద్దడి
● ఎండిపోతున్న వరి చేలు
● ఆందోళన చెందుతున్న రైతులు
దేవరపల్లి: తగినన్ని వానలు లేవు.. చెరువులకు కావాల్సినంత నీరు చేరడం లేదు.. ఆవ చెరువు ఆయకట్టులోని పొలాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. చెరువును నమ్ముకుని వేసిన వరి చేలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 500 ఎకరాల విస్తీర్ణం గల ఆవ చెరువు గ్రామానికి ఎగువన ఉంది. ఆవ నీటి ద్వారా త్యాజంపూడి, కురుకూరు, యర్నగూడెం గ్రామాలకు చెందిన రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో వరి వేసిన రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలకు ఆవ చెరువు నిండి సరస్సులుగా ఉంటుంది. ఆవ చెరువు నిండితే భూమిలో నీటి మట్టం పెరుగుతుంది. దీంతో బోర్లు సమృద్ధిగా నీరు తోడతాయని రైతులు అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవకపోవడంతో ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమవుతోందని రైతులు వాపోతున్నారు. జూలై నెలలో కురిసిన అడపాదడపా వర్షాలకు కొద్దిపాటి నీరు చెరువులోకి చేరినప్పటికీ తూముల ద్వారా దిగువకు విడుదల కావడంలేదని రైతులు తెలిపారు. చెరువు గట్టుపై రైతులు ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి ఎండిపోతున్న వరి చేలను బతికించుకుంటున్నారు. రోజుకు రూ.వెయ్యి ఆయిల్ ఖర్చు అవుతోందని, అంత పెట్టుబడి ఎక్కడని నుంచి తెచ్చి పెట్టగలమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండిన పంట విక్రయించినా ఆయిల్ ఖర్చు వచ్చే పరిస్థితి లేదని వారు గగ్గోలు పెడుతున్నారు.
1,800 ఎకరాల ఆయట్టు పొలాలు
ఆవ చెరువు కింద సుమారు 1800 ఎకరాల ఆయకట్టు పొలాలు ఉన్నాయి. ఎక్కువ విస్తీర్ణం త్యాజంపూడి, కురుకూరు రెవెన్యూ భూములు ఉన్నాయి. చెరువులకు ఇరిగేషన్ అధికారులు తూములు ఏర్పాటు చేసి ఏటా ఖరీఫ్ సీజన్‌లో వరి చేలకు నీటిని విడుదల చేస్తారు. చెరువు నీటితో పాటు బోర్ల ద్వారా రైతులు పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు 10 ఏళ్లుగా ఎప్పుడూ లేదని రైతులు అంటున్నారు. మరో పది రోజులు వాతావరణం ఇలాగే ఉంటే వేసిన వరి చేలు పనిచేయవని రైతులు వాపోతున్నారు.
తాడిపూడి నీటితో చెరువు నింపాలి
తాడిపూడి కాలువ నీటిని యర్నగూడెం గండి చెరువు ద్వారా ఆవ చెరువును నింపి పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2016–17 సంవత్సరంలో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఎద్దడి ఏర్పడగా యర్నగూడెం వద్ద తాడిపూడి కాలువకు అధికారులు సిమెంట్ తూరలు ఏర్పాటు చేసి గండి చెరువు ద్వారా ఆవ చెరువుకు నీరు సరఫరా చేశారు. చెరువును నింపి తూముల ద్వారా ఆయకట్టు పంట పొలాలకు నీటిని సరఫరా చేసేవారు. దీనికి అవసరమైన తూరలను ఆయకట్టు రైతులు సమకూర్చుకున్నారు. కొంత కాలం తర్వాత తూరలు పెట్టిన ప్రదేశంలో కాలువకు గండి పడడంతో తూరలను తీసివేశారని రైతులు తెలిపారు. ఈ ఏడాది నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నందున కాలువకు తూరలు ఏర్పాటు చేసి ఆవ చెరువు నింపాలని రైతులు అధికారులను కోరుతున్నారు. అవసరమైన తూరలను ఏర్పాటు చేస్తామని ఆయకట్టు రైతులు చెపుతున్నారు.
నది పక్కనే ఉన్నా నీటి కొరత
ఆవ చెరువు గట్టు పక్కనే చేలు ఉన్నా నీరు లేక ఎండిపోతున్నాయి. చెరువును నమ్ముకుని నాలుగు ఎకరాల్లో వరి పంట వేశాను. నీరు లేక మూనలు ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో ఆవ చెరువు ఎండిపోవడం ఎప్పుడూ లేదు. నాట్లు వేసి వారం దాటింది. నీరు లేక నెర్రెలు బారుతున్నాయి. ఇంజిన్ల ద్వారా చెరువులోని నీటిని తోడి చేలను బతికిస్తున్నాం. కూలి పనులకు వెళ్లి ఆయిల్ కొనుగోలు చేసి తెస్తున్నాం. ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు.
– నబిగిరి ముసలయ్య, రైతు,
త్యాజంపూడి, దేవరపల్లి మండలం

నీరు లేక నెర్రెలు..

నీరు లేక నెర్రెలు..

నీరు లేక నెర్రెలు..

నీరు లేక నెర్రెలు..