
‘సుఖీభవ’లో ఎందుకీ కోత?
చాగల్లు: రాష్ట్రంలోని దాదాపు 7 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ సాయాన్ని కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి వెంకట్రావు మండిపడ్డారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కేవలం 46 లక్షల మంది రైతులకే ఈ పథకాన్ని ఇస్తోందన్నారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందించిందని గుర్తు చేశారు. రైతులకు తమ ప్రభుత్వం రూ.1,70,845 కోట్ల మేర లబ్ధి అందించిందన్నారు. తమ ప్రభుత్వంలో 53 లక్షల మంది అర్హులైన రైతులను గుర్తించి, ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా నిధులు అందించామన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ.10,716 కోట్లు ఎందుకు ఎగ్గొట్టిందో చెప్పాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం రెండేళ్లకు కలిపి రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.40 వేల చొప్పున చెల్లించాలని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రతి రైతుకూ వ్యవసాయ పెట్టుబడి సాయంగా కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, రాష్ట్ర ఖజానా నుంచి రూ.20 వేలు ఇస్తామంటూ హామీ ఇచ్చారని చెప్పారు. నేడు దానిని రూ.14 వేలకు ఎందుకు తగ్గించారో, మిగిలిన రూ.6 వేలు ఎందుకు ఎగ్గొడుతున్నారో చంద్రబాబు చెప్పాలన్నారు.
రైతులకు చేసిన మేలేమిటో చెప్పండి
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ రైతులకు చేసిన మేలేమిటో చెప్పాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగిన ప్రతి సందర్భంలోనూ కేవలం 30 రోజుల్లోనే పరిహారం చెల్లించామని గుర్తు చేశారు. రైతుల పక్షాన ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని భరించామన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తేసిందని విమర్శించారు. ప్రీమియం చెల్లించిన రైతులకు సైతం పంటల బీమా చెల్లించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 నుంచి ఖరీఫ్, రబీ సీజన్లలో జరిగిన పంట నష్టాలకు పరిహారం, బీమా చెల్లించారా అని ప్రశ్నించారు. ‘విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించారా? వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించారా? వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సక్రమంగా నిర్వహిస్తున్నారా? రైతులు గిట్టుబాటు రేటు కోసం ఎందుకు రోడ్డెక్కుతున్నారు? ఎందుకు రాష్ట్రంలో మళ్లీ రైతు ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయో సీఎం సమాధానం చెప్పాలి’ అని వెంకట్రావు డిమాండ్ చేశారు.
ఫ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల
రైతులకు మొండిచెయ్యి
ఫ గత ఏడాది ఇవ్వాల్సిన
రూ.10,716 కోట్ల ఎగవేత
ఫ రూ.20 వేలు ఎందుకు ఇవ్వటం లేదు?