పోలవరం గట్టుపై కాసుల వేట | - | Sakshi
Sakshi News home page

పోలవరం గట్టుపై కాసుల వేట

Aug 3 2025 3:18 AM | Updated on Aug 3 2025 3:38 AM

కలవచర్లలో తవ్వకాలతో తరిగిపోతున్న పోలవరం కాలువగట్టు

యథేచ్ఛగా చెలరేగిపోతున్న మట్టి మాఫియా

కలవచర్లలో కాసులు కొట్టేస్తున్న

కూటమి నేతలు

రోజువారీ దందా రూ.25 లక్షల పైమాటే

పేదల లే అవుట్‌ పేరుతో ముఖ్య నేత మేత!

సాక్షి ప్రతినిధి, కాకినాడ: గ్రావెల్‌ మాఫియా పేట్రేగిపోతోంది. అడ్డూ అదుపూ లేకుండా గ్రావెల్‌ అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో టీడీపీ, జనసేన నేతలు మూడు టిప్పర్లు.. ఆరు లారీలు అంటూ అక్రమంగా రూ.లక్షలు మింగేస్తున్నారు. కొండలను పిండి చేస్తున్న కూటమి నేతలు చివరకు పోలవరం కాలువను కూడా విడిచిపెట్టడం లేదు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి కాకినాడ జిల్లా తుని మీదుగా విశాఖకు వెళ్తున్న పోలవరం ఎడమ కాలువ గట్లు కూటమి నేతలు కాసులు కురిపిస్తున్నాయి. ఇటు రాజానగరం, అటు జగ్గంపేట, తుని నియోజకవర్గాల పరిధిలో అధికార పార్టీ కీలక నేతలు తెర వెనుక ఉండి ద్వితీయ శ్రేణి నేతలతో ఆ కాలువ గట్టును గుల్ల చేస్తున్నారు. రాజానగరం నియోజకవర్గం కలవచర్ల, గాదరాడ తదితర ప్రాంతాల్లో పోలవరం కాలువ గట్టు స్థానిక జనసేన ముఖ్యనేతకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆ ముఖ్య నేత అండదండలతో అనుచరగణం అడ్డూ అదుపూ లేకుండా గడచిన నాలుగైదు నెలలుగా ఎర్రమట్టి, సుద్దమట్టి దందా నడుపుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు గోదావరిలో ఇసుకను తోడేళ్ల మాదిరిగా తోడేస్తున్నా వారి దాహం తీరడం లేదు.

కలవచర్లలో పోలవరం, పుష్కర కాలువ గట్లను రాత్రీ, పగలు తేడా లేకుండా తవ్వేసి లక్షలు మింగేస్తున్నారు. ఈ రెండు ప్రధాన కాలువలకు ఇరువైపులా 30, 40 అడుగుల ఎత్తున ఉన్న గట్లను ఇష్టారాజ్యంగా తవ్వి, తరలించేసి ఆనక వాటాలు పంచుకుంటున్నారు. భారీ యంత్రాలను వినియోగించి ఎర్ర మట్టి, సుద్దమట్టిని తవ్వి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, నర్సరీలకు విక్రయిస్తున్నారు. గ్రావెల్‌ రూపంలో ఉన్న ఎర్రమట్టిని నర్సరీలకు తరలిస్తున్నారు. వెలుగుబందలో పేదల కోసం సేకరించిన భూముల మెరక కోసమనే వంకతో పోలవరం కాలువ గట్టును తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు.

కలవచర్ల నుంచి నిత్యం రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు జరుపుతూ వస్తున్నారు. ఎటువంటి అనుమతీ లేకుండా పోలవరం గట్టు పొడవునా ఏడెనిమిది పొక్లెయిన్లు ఉపయోగించి 50 నుంచి 60 టిప్పర్లతో ఎర్ర గ్రావెల్‌ను అమ్మేసుకుంటున్నారు. ఒక టిప్పర్‌ రోజుకు ఆరేడు ట్రిప్పులు వేస్తోంది. ఇలా నిత్యం సుమారు 300 ట్రిప్పులు గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. టిప్పర్‌ గ్రావెల్‌ దూరాన్ని బట్టి రూ.7 వేల నుంచి రూ.8 వేల వంతున విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు సుమారు రూ.25 లక్షలు చేతులు మారుతున్నాయి. ఇలా వచ్చిన సొమ్ములో 40 శాతం నియోజకవర్గ జనసేన ముఖ్యనేతకు ముడుపుకట్టి ముట్టచెబుతున్నారని జిల్లా అంతటా కోడై కూస్తోంది. మిగిలిన 50 శాతంలో ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్న శ్రీరాంపురానికి చెందిన ముఖ్యనేత అనుచరుడు, స్థానిక అఽధికారులు సమానంగా వాటాలు వేసుకుంటున్నారని సమాచారం. ఇలా నాలుగైదు నెలలుగా సాగుతున్న దందా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దృష్టికి వెళ్లకుండా ఉంటుందా లేక, తెలిసినా పట్టించుకోలేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

కలవచర్ల నుంచి ఎర్రమట్టిని నర్సరీలకు ఎక్కువగా తరలిస్తున్నారు. వేమగిరి, కడియం, కడియపులంక, చొప్పెల్ల తదితర ప్రాంతాలలో నర్సరీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నర్సరీలతో పాటు రాజమహేంద్రవరం రూరల్‌ కాతేరు, జగ్గంపేట తదితర నియోజకవర్గాల్లోని లే అవుట్లకు ఇక్కడి నుంచి సుద్దమట్టిని తరలించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇన్ని నెలలుగా అనుమతి లేకుండా అక్రమంగా తవ్వేస్తున్న విషయం స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పెడచెవిన పెడుతూ వచ్చారు. చివరకు శుక్రవారం రాత్రి కలవచర్ల గ్రామస్తులు ఎదురు తిరగడం, కలెక్టర్‌ ప్రశాంతి చొరవతో గ్రావెల్‌ తవ్వకాలు వద్ద టిప్పర్లను సీజ్‌ చేయడంతో ప్రస్తుతానికి బ్రేక్‌ పడింది. కానీ వెలుగుబందలో పేదల ఇళ్ల స్థలాలు మెరక చేసే పని ఆగిపోతుందనే సాకుతో తిరిగి తవ్వకాల కోసం ఉన్నత స్థాయి నుంచి నియోజకవర్గ ముఖ్యనేత ఒత్తిళ్లు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

ఇదిలా ఉండగా తామేమైనా తక్కువ తిన్నామా అంటూ జగ్గంపేట, తుని నియోజకవర్గాల్లో తమ్ముళ్లు కూడా ఇదే పోలవరం కాలువ గట్టును తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారిలో కూడా కలవచర్లలో మాదిరిగానే పోలవరం కాలువ గట్టును యథేచ్ఛగా తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. మురారికి చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు గట్టు తవ్వే బాగోతాన్ని చక్కబెడుతున్నారు. మురారిలో కూడా ఆ పార్టీ ముఖ్యనేతల కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతోంది. తుని నియోజకవర్గం వెలమ కొత్తూరు, లోవకొత్తూరుల్లో సైతం పోలవరం ఎడమ కాలువ గట్టుపై ఇదే దందా చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఆ పచ్చనేతలు చక్కబెడుతున్నారు. ఆ పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. తమ స్వార్థం కోసం పోలవరం ఎడమ కాలువ గట్లు బలహీన పరుస్తుండటాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాగే తవ్వకాలు జరుపుతూ పోతే భవిషత్తులో కాలువలకు గండ్లు పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

కూటమి అండతోనే దందా

రాజానగరం నియోజకవర్గంలో కూటమి నేతల అండదండలతోనే మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఇదివరకు కొండుగుంటూరు, జి.యర్రంపాలెంలో కొండలు తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు పోలవవరం కాలువ గట్టును అడ్డంగా తవ్వేస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలతో గట్లు బలహీన పడి ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే అవుతుంది. ఇంత కాలం స్థానికులు ఫిర్యాదుచేసినా ఉపేక్షించారు. పర్యావరణానికి కూడా ఇది ముప్పుగా మారుతోంది.

– అడబాల చినబాబు, సీతారామపురం

రోడ్లు పాడవుతున్నాయి

రోజు రాత్రి, పగలు తేడా లేకుండా వందలాది లారీలలో మట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తుండటంతో రోడ్లు పాడైపోతున్నాయి. ప్రజలు భయంతో ఆందోళన చెందుతున్నారు. కంకర రాళ్లు లే చిపోయి, దుమ్ము, ధూళి ఎగసిపడుతోంది. దీనివలన రోడ్లపై ప్రయాణం చేయలేకపోతున్నాం. గ్రామస్తులు ఊపిరితిత్తులు పాడై, అనారోగ్యాల పాలవుతున్నారు.

– దాట్ల రఘు, కలవచర్ల

పోలవరం గట్టుపై కాసుల వేట1
1/4

పోలవరం గట్టుపై కాసుల వేట

పోలవరం గట్టుపై కాసుల వేట2
2/4

పోలవరం గట్టుపై కాసుల వేట

పోలవరం గట్టుపై కాసుల వేట3
3/4

పోలవరం గట్టుపై కాసుల వేట

పోలవరం గట్టుపై కాసుల వేట4
4/4

పోలవరం గట్టుపై కాసుల వేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement