సహనానికి పరీక్ష | - | Sakshi
Sakshi News home page

సహనానికి పరీక్ష

Jul 31 2025 8:26 AM | Updated on Jul 31 2025 8:36 AM

రాయవరం: పదో తరగతి అనేది విద్యార్థులకు అత్యంత కీలకమైన దశ. ఇక్కడ సాధించిన మార్కులే వారి ఉన్నత చదువులకు, మంచి ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడతాయి. పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. అయితే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు తెలుగు, ఇంగ్లిషు మీడియాల్లో రాసుకోవచ్చా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే కొందరు విద్యార్థులకు ఇంగ్లిషులో రాయాలంటే బెరకుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునే అవకాశాన్ని ఇస్తే బాగుంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు.

రెండు నెలలైనా..

నూతన విద్యా సంవత్సరం జూన్‌ 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇప్పటికి దాదాపు రెండు నెలలు పూర్తి కావస్తోంది. అలాగే విద్యార్థులకు ఆగస్టు 4వ తేదీ నుంచి సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పుడు పది పరీక్షలు ఇంగ్లిషు మీడియంతో పాటు, తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తారా, లేదా అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటుగా, తల్లిదండ్రులకు వచ్చిన ఈ ప్రశ్నకు సమాధానం కరవవుతోంది. గత విద్యా సంవత్సరంలో జరిగిన పది పబ్లిక్‌ పరీక్షల్లో తెలుగులో రాసుకునే వెసులుబాటును ప్రభుత్వ పరీక్షల విభాగం కల్పించింది. ఈ విధంగా గత విద్యా సంవత్సరంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 211 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, 15 మంది ప్రైవేటు విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాశారు.

వీడని ఉత్కంఠ

ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా పది పరీక్షలను తెలుగు మీడియంలో రాసుకునే వెసులుబాటు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నందున స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాఠ్య పుస్తకాలను బైలింగ్విల్‌ విధానంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బోధన రెండు భాషల్లోనూ వివరిస్తుండగా, పరీక్షలు మాత్రం ఇంగ్లిషు మీడియంలోనే రాయాల్సిన పరిస్థితి ఉంది. ఈ స్థితిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తెలుగు మీడియంలో పరీక్షలకు అవకాశం కల్పిస్తారా, లేదా అనే ప్రశ్న వేధిస్తోంది. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులు ఈ విషయమై ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు.

జిల్లాల వారీగా..

ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో 19,850 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అక్టోబర్‌ చివరి వారంలో పరీక్ష ఫీజు కట్టించుకునేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఈలోగా ఈ సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉంటుంది. వీటిలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 12,923 మంది విద్యాభ్యాసం చేస్తుండగా, 6,927 మంది విద్యార్థులు ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 26,898 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుండగా, వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో 13,600 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 13,298 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో 30,441 మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో 18,463 మంది, ప్రైవేటు స్కూళ్లలో 11,978 మంది చదువుతున్నారు.

స్పష్టత ఇస్తారా..

గతేడాది చివరి క్షణంలో తెలుగు మీడియంలో పరీక్షలు రాసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో గతంలో మాదిరిగా చివరి క్షణాల్లో చెప్పకుండా ముందుగానే స్పష్టత ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువస్తుండడంతో ఏమి చెప్పాలో వారికి కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వ పరీక్షల విభాగం ఈ విషయంలో స్పష్టత ఇచ్చి ఉత్కంఠకు ముగింపు పలకాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

పదో తరగతి విద్యార్థుల అయోమయం

తెలుగు మీడియంలో

పరీక్ష రాసే విషయంపై స్పష్టత కరవు

గతేడాది అవకాశం

ఈసారి ఇస్తారో, లేదో?

రెండు మాధ్యమాల్లో అవకాశమివ్వాలి

పదో తరగతి విద్యార్థులు తెలుగు, ఇంగ్లిషు మీడియాల్లో పబ్లిక్‌ పరీక్షలు రాసుకునేందుకు అవకాశమివ్వాలి. ఇంగ్లిషు మీడియంలో రాయడానికి కొందరు విద్యార్థులు భయపడుతున్నారు. వారి ఇష్టానికి ప్రాధాన్యమివ్వాలి.

– పి.సురేంద్రకుమార్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

ఉత్తర్వులు రావాలి

గత విద్యా సంవత్సరం మాదిరిగా రెండు మీడియాల్లో పదో తరగతి పరీక్షలు రాసుకునే వెసులుబాటుపై ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి ఉత్తర్వులు రావాలి. అవి వస్తేనే విద్యార్థులకు ఆ అవకాశం ఉంటుంది.

– బి.హనుమంతరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌, ప్రభుత్వ

పరీక్షల విభాగం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

ముందుగానే ప్రకటించాలి

ఆగస్టులో సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ముందుగానే పది పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపించాలి. తెలుగు, ఇంగ్లీషు మీడియంలో విద్యార్థులుపరీక్షలు రాసుకునేలా అవకాశమివ్వాలి.

– ఎస్‌ఎస్‌ పల్లంరాజు, ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

సహనానికి పరీక్ష1
1/3

సహనానికి పరీక్ష

సహనానికి పరీక్ష2
2/3

సహనానికి పరీక్ష

సహనానికి పరీక్ష3
3/3

సహనానికి పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement