
గంజాయి పట్టివేత?
సీతానగరం: మండలంలోని నల్గొండ దగ్గరలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఆదివారం గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని నల్గొండ – సీతానగరం మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రాజమహేంద్రవరానికి విచారణ నిమిత్తం తరలించారు. విచారణ అనంతరం రెండు రోజుల్లో పూర్తి వివరాలను తెలియజేస్తామని పోలీసులు వివరించారు.
మహిళకు తప్పిన ప్రాణాపాయం
● ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతుండగా కాపాడిన పోలీసులు
ధవళేశ్వరం: కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్న మహిళను ధవళేశ్వరం పోలీసులు రక్షించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ధవళేశ్వరం టిడ్కో గృహ సముదాయానికి చెందిన 28 ఏళ్ల మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఆమె తన బావకు ఫోన్‌చేసి విషయం చెప్పింది. దీంతో ఆయన 112కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ టి.గణేష్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను నాలుగు నిమిషాల వ్యవధిలో ఘటనాస్థలానికి పంపగా ఆయన వెంటనే తలుపులు పగులగొట్టి ఉరివేసుకోబోతున్న మహిళను కిందకు దించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ ప్రాణాలు కాపాడిన పీసీ వెంకటేష్, ఇన్‌స్పెక్టర్ గణేష్, కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఎస్పీ డి.నరసింహకిశోర్ అభినందించారు.