
● పరిరక్షణకు ప్రతినబూనాలి
● స్వరూపానందేంద్ర సరస్వతి
● ఘనంగా ప్రారంభమైన
అంతర్జాతీయ తెలుగు మహాసభలు
రాజానగరం: భాషలెన్ని ఉన్నప్పటికీ తెలుగు విశిష్టత, మాధుర్యం మరే ఇతర భాషల్లోనూ ఉండవని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. మన మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని, తెలుగుకు పూర్వవైభవం తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. స్థానిక గోదావరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించే రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వరూపానందేంద్ర మాట్లాడుతూ, సంస్కృత పదాలతో కూడిన వేదాన్ని ఉపయోగించి, బ్రహ్మదేవుడు సృష్టి చేసినట్లు శాస్త్రం చెబుతోందని అన్నారు. కానీ, ఆ సంస్కృతంలోనే కాదు, హిందీ, తమిళం, మరాఠీ, కన్నడ.. ఇలా ఏ ఇతర భాషలోనూ లేనన్ని అక్షరాలు తెలుగులో మాత్రమే ఉన్నాయని చెప్పారు. కావ్య, పురాణేతిహాసాల అనువాదాలను తెలుగు వారు చేసినట్టు మరే ఇతరులూ చేయలేరని అన్నారు. తెలుగులో ఉన్నన్ని యాసలు, ప్రాసలు, ఉప భాషలు మరెందులోనూ లేవని చెప్పారు. ఆధునిక పోకడలతో, మమ్మీ డాడీ విషసంస్కృతికి లోనైన తల్లిదండ్రులు మాతృ భాషకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించాలని, దీనిని పరిరక్షించుకోవాలని సూచించారు. పోతన భాగవతం, అన్నమయ్య కీర్తనలు వింటూంటే నేడు చాలా మంది పిల్లలు గేలి చేస్తూంటారని, ఆ కీర్తనల్లోని పదాల అర్థాలు తెలియకే అలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. పల్లెటూరి భాష, రాయలసీమ యాసలు సమ్మిళతమై ఉన్న ఆ పదాల్లోని భావాలను, మాధుర్యాన్ని గ్రహించాలని స్వరూపానందేంద్ర హితవు పలికారు.
తెలుగుతో సంస్కారం
మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి మాట్లాడుతూ, తెలుగు నేర్చుకుంటే సంస్కారం అలవడుతుందని చెప్పారు. మాతృభాష కళ్లు అయితే పరభాష కళ్లద్దాల వంటిదని, కళ్లు లేకపోతే కళ్లద్దాలతో పని ఏముంటుందని అన్నారు. యువతలో భాషాభిమానం కలగాలని, అప్పుడే మాతృభాషకు రాణింపు ఉంటుందని హితవు పలికారు.
మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు నేలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్, నిఘంటువును రూపొందించిన సీపీ బ్రౌన్, తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్‌టీ రామారావు, పార్లమెంటులో జాతీయ భాషలన్నింటిలోనూ మాట్లాడే అవకాశం కల్పించిన మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలుగు వారికి ఎల్లప్పుడూ చిరస్మరణీయులేనని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడుతూ, తెలుగు భాష ఉన్నతికి ఇటువంటి మహాసభల నిర్వహణతో సరిపెట్టకుండా ఒక ట్రస్టు ఏర్పాటు చేయాలనే ఆలోచన తనకుందని అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలుగు భాషలోని మాధుర్యాన్ని అందరూ అర్థం చేసుకుని, పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలే విశాఖలో నిర్వహించాలని తొలుత భావించామని, అయితే రాజరాజనరేంద్రుని సహస్రాబ్ది ఉత్సవాలు, ‘నన్నయ’ భాగవత రచన చేసి వెయ్యేళ్లు పూర్తి కావడం అరుదైన సమయంగా భావించి రాజమహేంద్రవరాన్ని ఎంచుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూకే ఉప కులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు, రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్, కవి అందెశ్రీ, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కిమ్స్, గైట్ కళాశాలల ఎండీలు రవికిరణ్‌వర్మ, శశికిరణ్‌వర్మ, తెలుగు మహాసభల సమన్వయకర్త సునంద రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. మహాసభల్లో భాగంగా తొలి రోజున నారాయణభట్టు వేదికపై కవులు కవితా నీరాజనం అర్పించగా, నన్నయ వేదికపై భాషా ప్రక్రియ సదస్సులు నిర్వహించారు. వాటిల్లో పలువురు సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు.

అలరించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన