మహిళల రక్షణ, భద్రత ‘దిశ’గా.. | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణ, భద్రత ‘దిశ’గా..

Published Sat, Nov 11 2023 2:44 AM

దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్న పోలీసులు - Sakshi

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో శుక్రవారం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 20,069 మంది మహిళలు దిశాయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మహిళల రక్షణ, భద్రతే లక్ష్యంగా ఎస్పీ పి.జగదీష్‌ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కాలేజీలు, స్కూళ్లు, సచివాలయాలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, రైల్వే స్టేషన్లు, హాస్పిటళ్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ముఖ్య కూడళ్లలో దిశ యాప్‌పై యువతలు, మహిళలకు అవగాహన కల్పించారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలోమహిళలు, యువతులను వారి ఫోన్‌కు వచ్చే ఓటీపీని పోలీసులు అడక్కూడదని ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్పీ జగదీష్‌ మాట్లాడుతూ యువతులు, మహిళలు కచ్చితంగా దిశా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఆపదలో ఉన్నప్పుడు పోలీసులతో పాటు ఐదుగురు కుటుంబసభ్యులు, స్నేహితులకు తక్షణం సమాచారం చేరవేసే ఏర్పాటు దిశ యాప్‌లో ఉంటుందన్నారు. ప్రయాణ సమయంలో ట్రాక్‌ మై ట్రావెల్‌ ఆప్షన్‌ ఉంటుందని, చేరాల్సిన గమ్యస్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం యాప్‌ ట్రాకింగ్‌ చేస్తుందన్నారు. వాహనం దారి తప్పితే ఆ సమాచారం వెంటనే దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో పాటు బంధుమిత్రులకు చేరవేస్తుందన్నారు. దిశ యాప్‌లో 100, 112 వంటి అత్యవసర నంబర్లతో పాటు పోలీస్‌ స్టేషన్లు, ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, బ్లడ్‌ బ్యాంకులు, ట్రామా కేర్‌ సెంటర్లు, మెడికల్‌ షాపుల వివరాలు పొందుపర్చారన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఫోనన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు పోలీసులకు సందేశం చేరుతుందన్నారు.

జిల్లాలో దిశాయాప్‌ ప్రత్యేక డ్రైవ్‌

ఒకేరోజు 20,069 మంది డౌన్‌లోడ్‌

Advertisement
 
Advertisement