పల్లెల్లో కూటమికి జెల్ల | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో కూటమికి జెల్ల

Nov 28 2026 12:08 AM | Updated on Nov 28 2026 12:08 AM

● కోనసీమలో ఫ్యాన్‌ హవా

● తొలి విడతలో కీలక

పంచాయతీలు కై వసం

● సొంత గ్రామాల్లోనూ

ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బలు

● మేజర్‌ పంచాయతీల్లోనూ

వైఎస్సార్‌ సీపీ జెండా రెపరెపలు

సాక్షి, అమలాపురం: అధికారంలో ఉన్నామన్న ధీమా.. అంగబలం.. అర్థబలం.. అధికార యంత్రాంగం అండ.. వెరసి పల్లెపోరులో తిరుగు లేని ఆధిక్యం సాధించాలన్న కూటమి నేతల వ్యూహాలకు గ్రామీణ ఓటర్లు గట్టి షాక్‌ ఇచ్చారు. అధికార పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామాల్లోనూ వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులకు పట్టం కట్టారు. ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనే ఎదురుదెబ్బలు తగలడం, కీలకమైన మేజర్‌ పంచాయతీల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నామినేషన్‌ నుంచి పోలింగ్‌ వరకు వివాదాలు, ఒత్తిళ్లు ఎదురైనా పల్లె ఓటర్లు మాత్రం తమ తీర్పుతో కూటమికి కళ్లు బైర్లు కమ్మేలా జెల్ల కొట్టారు.

రాజోలు నియోజకవర్గంలో శ్రీఫ్యాన్‌శ్రీ హవా

రాజోలు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు పలు కీలక విజయాలు సాధించారు.

● మలికిపురం మండలంలో ఏకంగా ఆరు పంచాయతీలను కై వసం చేసుకున్నారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ సొంత గ్రామం దిండిలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు నల్లి సుశీల విజయం సాధించడం విశేషం. రామరాజులంక, గూడపల్లి, శంకరగుప్తం వంటి మేజర్‌ పంచాయతీలతో పాటు తూర్పుపాలెం, గుబ్బలపాలేల్లోనూ వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు గెలుపొందారు. మరోవైపు మలికిపురం, లక్కవరం గ్రామాల్లో ఎమ్మెల్యేకి సన్నిహితులుగా ఉన్న జనసేన మద్దతుదారులు టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు.

● రాజోలు మండలంలో జనసేనకు పట్టున్న కాట్రేనిపాడులో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు విజయం సాధించారు. నియోజకవర్గ కేంద్రం రాజోలులో ఎమ్మెల్యే దేవ స్వయంగా ప్రచారం చేసినా జనసేన మద్దతుతో పోటీ చేసిన దారపురెడ్డి బాబ్జీ గెలవలేకపోయారు. ఇక్కడ టీడీపీ మద్దతుదారు పామర్తి రమణ గెలిచారు. ఇదే మండలం పాలగుమ్మి, మెరకపాలేల్లో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.

● మండల కేంద్రం సఖినేటిపల్లిలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు గొల్లమందల జ్యోతి ఏకంగా 967 ఓట్ల మెజార్టీతో జనసేన మద్దతుదారు జల్లి విజయలక్ష్మిపై విజయం సాధించారు. ఇటీవలి ఎంపీటీసీ ఎన్నికల్లో మూడు స్థానాలను కూటమి గెలుచుకున్నచోట ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తన సత్తా చాటుకుంది. గొంది, కేశవదాసుపాలెం, మోరిపాడుల్లో విజయం సాధించింది.

● మండల కేంద్రమైన మామిడికుదురును సైతం వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకుంది. ఇక్కడ ఇటీవల జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచిన గొల్లపల్లి అమూల్య జెడ్పీ చైర్‌పర్సన్‌ అయ్యారు. కానీ, ఇక్కడ సర్పంచ్‌ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి నయినాల ఆదిలక్ష్మిపై వైఎస్సార్‌ సీపీ బలపరిచిన నయినాల రాజేశ్వరి గెలుపొందడం గమనార్హం. కరవాక, నగరం, గోగన్నమఠం పంచాయతీల్లోనూ వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు.

మేజర్‌ పంచాయతీల్లోనూ పట్టు

● ముమ్మిడివరం నియోజకవర్గంలో కీలక గ్రామాలను కై వసం చేసుకోవడం వైఎస్సార్‌ సీపీకి కలిసొచ్చింది. ముమ్మిడివరం మండలంలోని మేజర్‌ పంచాయతీ అనాతవరంలో కోరశిక మంగతాయారు 726 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. లంకాఫ్‌ ఠాణేలంకలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు గెలుపొందారు.

● ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో సానబోయిన భాస్కరరావు, పశువుల్లంకలో అద్దాడి శాంతి విజయం సాధించారు. సొంత గ్రామం పశువుల్లంకలో గెలుపును టీడీపీ సీనియర్‌ నాయకుడు ధూళిపూడి చక్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఫలితం దక్కలేదు.

● కాట్రేనికోన మండలంలోని బ్రహ్మసమేథ్యం, కుండలేశ్వరం, ఉప్పూడి, బంటుమిల్లి పంచాయతీలను వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు.

పేరూరులో సంచలన విజయం

● జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని ఆనుకుని ఉన్న పేరూరు మేజర్‌ పంచాయతీలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు చొల్లంగి సుబ్బిరామ్‌ 505 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శిగా ఉన్న ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ రాష్ట్ర నాయకులు పెచ్చెట్టి చంద్రమౌళి తదితరులు ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. ఇటీవలి ఎంపీటీసీ ఎన్నికల్లో మూడు టీడీపీ, ఒక జనసేన రెబల్‌ అభ్యర్థి గెలిచిన ఈ గ్రామంలో ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు సర్పంచ్‌గా గెలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

● ఇదే మండలం భట్నవిల్లిలో డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ ఇళ్ల సత్యగోపాలకృష్ణ విజయం సాధించగా, గున్నే పల్లి అగ్రహారం, తాండవపల్లి, చిందాడగరువుల్లోనూ వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు గెలిచారు. అయితే, తాండవపల్లిలో గెలిచిన గుత్తాల జయలక్ష్మి 24 గంటలు గడవకముందే టీడీపీలో చేరడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

● ఉప్పలగుప్తం మండలంలోని మేజర్‌ పంచాయతీ చల్లపల్లితో పాటు కిత్తనచెరువును సైతం వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు కై వసం చేసుకున్నారు.

అడ్డదారులు తొక్కినా

తప్పని అపజయం

అల్లవరం మండలం తుమ్మలపల్లిలో నామినేషన్‌ వివాదం కూటమికి ప్రతికూలంగా మారింది. గడువు దాటిన తర్వాత టీడీపీ మద్దతుదారు వడ్డి సుభాషిణి నామినేషన్‌ దాఖలు చేశారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ చింతా అనురాధ, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పినిపే శ్రీకాంత్‌, ఆ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారులు టీడీపీ మద్దతుదారు నామినేషన్‌ను ఆమోదించారు. స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, బీజేపీ సీనియర్‌ నాయకుడు యాళ్ల దొరబాబు సైతం నామినేషన్‌ కేంద్రానికి వెళ్లడం అప్పట్లో వివాదాస్పదమైంది. చివరకు ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు కాట్రు లక్ష్మీరాజు చేతిలో సుభాషిణి ఓటమి పాలయ్యారు. ఇదే మండలం మొగళ్లమూరు, కోడూరుపాడు, తాడికోన, గుండెపూడిల్లోనూ వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా తొలి విడత ఎన్నికల్లో కూటమి నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామాల్లోనే వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు విజయబావుటాలు ఎగురవేయడం ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement