అమలాపురం టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎంఎన్‌ఓ), ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ(ఎఫ్‌ఎన్‌ఓ)ల నియామకాలు నిలిచిపోయాయని ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది సంఘం రాష్ట్ర కార్యదర్శి పీవీవీ సుబ్బారావు అన్నారు. జిల్లాలోని ప్రభుత్ర ఆస్పత్రుల్లో పని చేస్తున్న సిబ్బందితో అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్) కార్యాలయంలో డాక్టర్ కార్తిక్ ఆధ్వర్యాన శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు పలు సమస్యలను ప్రస్తావించారు. ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు రిటైరైన ఆ పోస్టులను భర్తీ చేయడం లేదని చెప్పారు. ఆస్పత్రులకు నడవలేని రోగులు వచ్చినప్పుడు వారిని స్ట్రెచర్లు లేదా వీల్ చైర్‌పై తీసుకెళ్లేందుకు సిబ్బంది అందుబాటులో లేక బాధిత కుటుంబీకులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో జనరల్ డ్యూటీ(జీడీ)లు చేసే సిబ్బందిని ఇతర పనులకు ఉపయోగిస్తున్నారని, రోగులను తరలించే పనిని విస్మరిస్తున్నారని వివరించారు. ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌వోల విధులను ఇప్పుడు జీడీలతో చేయిస్తున్నారన్నారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని కార్తిక్ హామీ ఇచ్చారు. సమావేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.నాగేంద్ర, కోశాధికారి దుర్గాబాయి, అమలాపురం సంఘం కార్యదర్శి ఎస్.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
నేడు జవహర్ నవోదయ
ప్రవేశ పరీక్ష
పెద్దాపురం: ప్రధాన మంత్రి జవహర్ నవోదయ విద్యాలయలో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యాలయ ప్రిన్సిపాల్ శరత్ చంద్రకీర్తి శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. మొత్తం 39 కేంద్రాల్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.


