ప్రచారం.. సమాప్తం | - | Sakshi
Sakshi News home page

ప్రచారం.. సమాప్తం

Nov 28 2026 12:08 AM | Updated on Nov 28 2026 12:08 AM

సాక్షి, అమలాపురం: జిల్లాలో పల్లెపోరు తుది అంకానికి చేరింది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇన్నాళ్లూ ఓట్ల కోసం అభ్యర్థులు పెట్టిన పరుగులు, హామీలు, బుజ్జగింపులు, ఇంటింటి ప్రచారాలకు శుక్రవారం సాయంత్రంతో తెర పడింది. ప్రచార గడువు ముగియడంతో ఇక ఓటర్ల తీర్పే అంతిమం కానుంది. జిల్లాలో రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి విడతగా అమలాపురం రెవెన్యూ డివిజన్‌లోని 10 మండలాల్లో గురువారం ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్తపేట, రామచంద్రపురం డివిజన్లలోని 9 మండలాల్లో రెండో విడత ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఈ విడత మొత్తం 165 గ్రామ పంచాయతీలకు గాను 17 పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. మరో మూడు గ్రామాల్లో సర్పంచ్‌, ఆరు గ్రామాల్లో వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 148 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, 1,167 వార్డు సభ్యుల స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు.

చివరి రోజు హోరెత్తిన ప్రచారం

తొలి విడత ఎన్నికల్లో వచ్చిన సానుకూల ఫలితాలు ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. గ్రామాల్లో వీధివీధినా తిరుగుతూ ఓటర్లను కలిశారు. తమ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తొలి విడత ఫలితాల నేపథ్యంలో రెండో విడత పోరు మరింత రసవత్తరంగా మారింది. ముఖ్యంగా కీలకమైన మేజర్‌ పంచాయతీల్లో పట్టు నిలుపుకోవడం, ప్రత్యర్థులకు చెక్‌ పెట్టడం లక్ష్యంగా చివరి రోజు అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. అంబాజీపేట మండలం మాచవరం, కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, పి.గన్నవరం, అయినవిల్లి వంటి ప్రాంతాల్లో చివరి రోజు ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులు సైతం తమ బలాన్ని చాటుకునేందుకు చివరి ప్రయత్నాలు చేశారు. గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు, స్థానిక నాయకుల ప్రభావం, అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి.

9 మండలాల్లో రేపు రెండో విడత పల్లె పోరు

148 సర్పంచ్‌ స్థానాలకు నిర్వహణ

చివరి రోజున హోరెత్తిన ప్రచారం

తొలి విడత ఫలితాల ప్రభావంతో ఉత్సాహం

ప్రచారంలో దూసుకుపోయిన వైఎస్సార్‌ సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement