కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ఆదివారం ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియాదేవి, ఎస్పీ రాహుల్ మీనా తదితరులతో కలిసి జిల్లాలోని ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టరేట్ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మొదటి దశలో పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియల్లో జాప్యానికి గల కారణాలను విశ్లేషించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి దశలో జరిగిన పరిణామాలు, లోపాలు రెండో దశలో ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. నిర్దేశిత సమయానికి స్వర్ణ పంచాయతీ యాప్‌లో పోలింగ్ శాతం నమోదు చేయాలన్నారు. ఎన్నికల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిబంధనల ప్రకారం నిర్వహించడం వంటి కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు తప్పనిసరిగా ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. రెండో దశ పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ రాహుల్ మీనా చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ అధికారి శాంతలక్ష్మి, జెడ్పీ సీఈఓ పి.వసంత మాధవి తదితరులు పాల్గొన్నారు.
కనకదాసుకు ఘన నివాళి
అమలాపురం రూరల్: ప్రముఖ భక్తి కీర్తనకారుడు, తత్వవేత్త, సంఘ సంస్కర్త కనకదాసు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి ఘనంగా నివాళి అర్పించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఆయన జీవిత విశేషాలను వివరించారు. కనకదాసు ఆశయాలు, బోధనలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వి.సుబ్బారావు, బీసీ సంక్షేమ అధికారి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కోడ్ పక్కాగా అమలు చేయాలి
అమలాపురం రూరల్: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అధికారి దుండి రాంబాబు సూచించారు. ఎన్నికలు జరిగే 9 మండలాల్లో 27 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బృందాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు చేపట్టాలని సూచించారు. అయినవిల్లి, కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు, రామచంద్రపురం మండలాల్లో ఆయన శుక్రవారం పర్యటించి, పలు ప్రచార వాహనాలను తనిఖీ చేశారు. ఫలితాల ప్రకటన పూర్తయ్యేంత వరకు కోడ్ అమలులో ఉంటుందని రాంబాబు స్పష్టం చేశారు.
సంస్కృతీ ఉత్సవ్
ప్రచార పత్రికల ఆవిష్కరణ
అమలాపురం టౌన్: ఆకొండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యాన అమలాపురంలో ఏటా నిర్వహించే కోనసీమ సంస్కృతీ ఉత్సవ్ ప్రచార పత్రికలను కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద సరస్వతి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ ఉత్సవ్ ద్వారా వివిధ పోటీలు నిర్వహించి విద్యార్థులకు మన ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్న సంస్థ అధ్యక్షుడు ఆకొండి పవన్‌ను అభినందించారు. ఈ ఉత్సవ్ విజయవంతం కావాలని ఆశీర్వదించారు. సంస్కృతీ ఉత్సవ్‌కు డిసెంబర్ పదో తేదీ లోపు ఆన్‌లైన్ రిజిస్టేషన్లు పూర్తి చేయాలని పవన్ తెలిపారు. వివరాలకు 81065 76555 వాట్సాప్ నంబరులో సంప్రదించాలని కోరారు.
భవిష్య నిధి ఏర్పాటు చేయాలి
అమలాపురం టౌన్: తమ సంక్షేమానికి కూడా భవిష్య నిధి ఏర్పాటు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థల సిబ్బందికి భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేడీ) జి.నాగమణికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కాకినాడలో జరిగిన 8 జిల్లాల జోనల్ స్థాయి సమావేశం అనంతరం ఆమెను కలిసి, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల భద్రతపై చర్చించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పి.లక్ష్మీ శ్రీనివాసన్, జి.రమేష్, తులిప్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


