● గోడిలో ఉప సర్పంచ్ పదవి
కోసం రాక్షసత్వం
● మాజీ ఎంపీ అనురాధ, ఎమ్మెల్సీ
ఇజ్రాయిల్ కార్ల అడ్డగింపు
● అనురాధ కారుపై దాడి
● అందులో ఉన్న వార్డు సభ్యుడిని
కొట్టేందుకు యత్నం
● పోలీసుల సమక్షంలోనే దుర్మార్గం
● ప్రణాళిక ప్రకారమే
టీడీపీ శ్రేణుల పన్నాగం
అల్లవరం: ఉప సర్పంచ్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలనే కుట్రతో టీడీపీ గూండాగిరీకి పాల్పడింది. ఏకంగా ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కారు పైన, వార్డు సభ్యుడి పైన దాడికి ఒడిగట్టారు. ఆ పార్టీ అల్లవరం మండల అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబురాజు ఆధ్వర్యాన టీడీపీ శ్రేణులు అరాచకాలు సృష్టించాయి. ఈ సంఘటనతో గోడి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఏం జరిగిందంటే.
గోడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేత సత్తిబాబురాజు భార్య దెందుకూరి మాలతి, బీసీ సామాజిక వర్గానికి చెందిన కుక్కల కనకదుర్గ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేశారు. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో మాలతి విజయం సాధించారు. ఆమె వర్గానికి చెందిన వారు 5, కనకదుర్గ వర్గీయులు 5 చొప్పున వార్డులు గెలుచుకున్నారు. ఒకటో వార్డులో జనసేన బలపరిచిన బండారు వీర వెంకట సత్యనారాయణ ఏకగ్రీవమయ్యారు. ఫలితాల అనంతరం ఆయన ఉప సర్పంచ్ పదవిని ఆశించారు. దీనికి సత్తిబాబురాజు ఒప్పుకోలేదు. దీంతో, ఇరు వర్గాల మధ్య గురువారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి రఘురామ్ ఉప సర్పంచ్ ఎన్నికను శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు. ఉదయం 10.30 గంటలకు ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, సర్పంచ్ భర్త సత్తిబాబురాజు ఆర్‌ఓపై ఒత్తిడి తెచ్చి, ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు నోటీసు బోర్డులో అతికించారు. దీంతో, వ్యవహారం ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణకు దారి తీసింది. తమకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎన్నికల అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉప సర్పంచ్ ఎన్నికను ఎలా వాయిదా వేస్తారని వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన టీడీపీ ఏజెంటుగా వ్యవహరించారని మండిపడ్డారు. దీంతో, రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులపై దాడులకు ప్రయత్నించారు.
సచివాలయానికి వస్తుండగా దాడి
ఈ తరుణంలో ఉప సర్పంచ్ ఎన్నిక కోసం గోడి సచివాలయానికి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ చింతా అనురాధ వారి కార్లలో వస్తున్నారు. వారి కార్లపై టీడీపీ గూండాలు ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. మాజీ ఎంపీ చింతా అనురాధ కారులో ఉన్న ఒకటో వార్డు సభ్యుడు బండారు వీర వెంకట సత్యనారాయణపై దాడికి ప్రయత్నించారు. మాజీ ఎంపీ అనురాధ కారుకు కొబ్బరి దుంగలు అడ్డంగా పెట్టి, పోలీసుల సమక్షంలోనే డోర్లు బలవంతంగా లాగేయడంతో కారు దెబ్బ తింది. అనురాధ వర్గీయులు రక్షణగా నిలవడంతో వీర వెంకట సత్యనారాయణకు ప్రమాదం తప్పింది. తమతో సమావేశం నిర్వహించి, న్యాయబద్ధంగా ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. టీడీపీ గూండాగిరీపై ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, మాజీ ఎంపీ అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు అప్రమత్తం
టీడీపీ శ్రేణుల అరాచకాలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ నేతృత్వంలో సీఐలు ప్రశాంత్ కుమార్, వీరబాబు గోడి గ్రామానికి చేరుకున్నారు. సంఘటన స్థలం వద్ద అల్లరి మూకలను చెదరగొట్టి సాధారణ పరిస్థితి తీసుకొచ్చారు.


