అమలాపురం రూరల్: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం జరగాల్సిన జిల్లా, డివిజన్, మండల స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్ సీపీలోకి
భారీగా చేరికలు
ఆహ్వానించిన మాజీ మంత్రి కన్నబాబు
కాకినాడ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ మండలంలోని రేపూరు గ్రామానికి చెందిన టీడీపీ, జనసేనలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం రాత్రి వైఎస్సార్ సీపీలో చేరారు. కాకినాడ వైద్యనగర్లోని వైఎస్సార్ సీపీ రూరల్ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు సమక్షంలో రేపూరు గ్రామానికి చెందిన నేతలు చేరారు. వీరికి కన్నబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో ముద్రగడ మాణిక్యాల దేవి, ముద్రగడ తిరుపతిరావు, ముద్రగడ వీరరాఘవులు, పెండెం వీర్రాజు, పెండెం శ్రీను, వెలుగుబంట్ల సత్తిబాబు, తలాటం నాగేశ్వరరావు, తలాటం రామకృష్ణ, తలాటం పెదకాపు, తలాటం తాతీలు ఎడాకుల అక్షయ్, దామలంక పేర్రాజు తదితరులు సుమారు 50 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రజా బలంతో విజయం సాధిస్తారన్నారు. రేపూరు గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు తలాటం ధర్మరాజు, నల్లా సత్యనారాయణ, ముద్దన సూరిబాబు, ముమ్మిడి కనకరాజు, అడపా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. దీనికి సంబంధించి ఈ నెల 21 నుంచి 23 వరకూ నామినేషన్లు అందజేయవచ్చు. ఎంపీటీసీలకు సంబంధించిన నామినేషన్లను ఆయా మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో ఆర్వోలు ఉంటారు. జెడ్పీటీసీ నామినేషన్లను కాకినాడలోని జెడ్పీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ అపూర్వ భరత్ స్వీకరిస్తారు. 24న నామినేషన్లు స్క్రూట్నీ, 25న అభ్యంతరాల స్వీకరణ, 26న అభ్యంతరాల పరిష్కారం, 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో 1,426 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
సమయం..
మించిపోయింది మరి!
పెద్దాపురం: సమయానికి అనుగుణంగా నడుకోవాలంటారు పెద్దలు. అలాంటి సమయం మించిపోవడంతో ఓ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాన్ని కోల్పోయింది. పెద్దాపురం మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ వేయడానికి ఆదివారం చివరి రోజు. స్థానిక బచ్చు గురుమూర్తి మున్సిపల్ ఆడిటోరియంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల లోపు నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులను మాత్రమే పోలీసులు లోపలకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఓ యువతి తన తండ్రితో కలసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు పరుగులెత్తుకుంటూ మూడు గంటల దాటిన తరువాత నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకుంది. అయితే అప్పటికే గడుపు ముగిసిందని, నిబంధనల ప్రకారం కుదరదని అధికారులు సృష్టం చేయడంతో, చేసేది లేక ఆ తండ్రీ కూతుర్లు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.


