● గ్యాస్ కిక్‌లకు గురవుతున్న బావులు
● ఓఎన్‌జీసీకి సవాలుగా మారుతున్న వైనం
● నాడు మోరి–7లో.. మొన్న కరవాక –27లో
ప్రొడక్షన్ టెస్టింగ్‌లలో తప్పిన బ్లో అవుట్లు
● ఓఎన్జీసీకి సవాల్‌గా మారిన డ్రిల్లింగ్‌లు
మలికిపురం: అది 1995వ సంవత్సరం. కేజీ బేసిన్‌లో రాజోలు దీవిలోని కేజీ బేసిన్‌లో ఓఎన్జీసీ కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్న రోజులు. ఆ ఏడాది మార్చి నెలలో మండలం చింతలమోరిలో మోరి వెస్ట్–7 బావిలో సుమారు రెండు నెలల పాటు 2,700 మీటర్ల లోతుకు ఓఎన్‌జీసీ విజయవంతంగా డ్రిల్లింగ్ నిర్వహించింది. ఈ బావిలో అపార చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని గుర్తించిన సిబ్బంది ఆనందోత్సాహాలతో ఉత్పత్తి పరీక్షలకు శ్రీకారం చుట్టారు. పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ ఎగజిమ్మింది. ఈ హఠాత్ పరిణామంతో షాక్ తిన్న అధికారులు, ఈ బావిలో బ్లో–అవుట్ ప్రమాదం ఉందని గుర్తించి ఉన్నతాధికారులకు పరిస్థితి వివరించారు. నిక్షేపాలు పుష్కలంగా ఉండడంతో ఈ బావిని వదులు కోలేని ఓఎన్జీసీ అప్పటి అధునాత సాంకేతిక పరికరాలతో సుమారు మరో రెండు నెలల పాటు శ్రమించినప్పటికీ ఫలితం లేదు. వెల్ నుంచి బారీగా గ్యాస్‌కిక్‌లు వచ్చాయి. దీంతో చేసేది లేక అధికారులు ఆ బావిని మూసేశారు. అనంతరం ఇక్కడి డ్రిల్లింగులలో పలు బావులో ఇబ్బందులు ఏర్పడినప్పటికీ అదే పాయింట్‌లో మరో వెల్ ఏర్పాటు చేసి విజయం సాధించారు. అయితే మోరి–7 బావి ఇప్పటికీ తెరవ లేక మొత్తం సైట్ మూసేశారు.
సుమారు 15 ఏళ్ల అనంతరం కాట్రేనిపాడులోని కరవాక–27 బావిలో ఓఎన్‌జీసీకి మోరి–7 బావికి మించిన తీవ్ర సమస్య ఎదురైంది. 2011 ఏప్రిల్ నెలలో ఈ బావిలో డ్రిల్లింగ్ ప్రారంభించారు. ఆ ఏడాది సెప్టెంబరు వరకూ సుమారు 3200 మీటర్ల లోతు డ్రిల్లింగ్ చేసి అపార చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రొడక్షన్ టెస్టింగ్ పనుల్లో ఇబ్బందులు ఏర్పడి అప్పట్లో బ్లో–అవుట్ ప్రమాదం తప్పింది. ఆ వెల్‌ను మూసివేసిన అదికారులు అక్టోబరు నెలలో పక్కనే మరో బావి వేసి డ్రిల్లింగ్ ప్రారంభించారు. మరో మూడు నెలలపాటు శ్రమించిన సిబ్బంది ప్రస్తుతం 3,886 మీటర్ల లోతు డ్రిల్లింగ్ చేశారు. మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అయింది. ప్రొడక్షన్ టెస్టింగ్ చేపట్టిన ఈ బావి నుంచి రెండు రోజుల పాటు ముడి చమురు, గ్యాస్ ఎగజిమ్మాయి. ఈ బావిలో సెకనుకు 7 వేల క్యూబిక్ మీటర్ల పీడనం నమోదైంది. సాధారణ స్థాయి మూడు వేలకు పీడనం దిగితే ఈ బావిని వినియోగించవచ్చని భావించారు. కానీ ఈ బావిని కూడా అప్పట్లో మూసేశారు. అదే పరిస్థితి ఈ ఏడాది జనవరి నెల ఐదో తేదీన మలికిపురం మండలంలోని ఇరుసుమండ గ్రామంలో మోరి–5 బావిలో ఎదురైంది.
ఇటీవల ఇలాంటి మూతపడిన బావులను పునరుద్ధరించి ఉత్పత్తి ప్రారంభించే పనులలో బాగంగా డీప్ సంస్థ డ్రిలింగ్ ప్రారంభించింది. ఈ బావిని కూడా మోరి–7, కరవాక–27 బావుల మాదిరిగానే 2012 సంవత్సరంలో అనేక ఇబ్బందులు పడి బ్లో అవుట్ ప్రమాదం పొంచి ఉండడంతో మూసేశారు. డీప్ సంస్థ గత జనవరి నెలలో దీనిని ప్రారంభించి భారీగా ఉన్న గ్యాస్ నిల్వలను అదుపు చేయలేకపోవడంతో బోఅవుట్ సంభవించింది. వారం తరువాత ఉన్నత స్థాయి అధికారుల జోక్యంతో దానిని అదుపు లోనికి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే బావిలోనే ఏర్పడిన మార్పులతో దానికదే మూసుకుపోయి బ్లోఅవుట్ అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం ఇలాంటి బావులను తెరిచే పనులలో ఇక్కడ గుత్తేదారు సంస్థలు నిమగ్నమయ్యాయి. సముద్ర తీరంలోని కరవాక, తూర్పుపాలెం గ్రామాలలోని సుమారు పది బావులను ప్రస్తుతం డ్రిల్లింగ్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం సముద్ర తీరంలో ఇటీవల ఉత్పత్తిలో ఉన్న బావుల నుంచి సైతం గ్యాస్ కిక్‌లు రావడంతో మరమ్మతులు చేయడం, అతి కష్టం మీద అదుపు చేస్తున్న సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. తూర్పుపాలెంలోని కేఎస్‌పీ–46 బావి సైతం తరచూ మొరాయిస్తూ సిబ్బందికి సవాలు విసురుతోంది.
గత జనవరిలో ఇరుసుమండలోని మోరి–5 బావిలో సంభవించిన బ్లో అవుట్
రాజోలు మండలం పొన్నమండ చమురు బావిలో గ్యాస్ లీకేజీని నియంత్రిస్తున్న సిబ్బంది


