కిడ్నాప్‌నకు గురైన ప్రకాష్‌ది హత్యే | - | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌నకు గురైన ప్రకాష్‌ది హత్యే

Sep 28 2026 12:41 AM | Updated on Sep 28 2026 12:41 AM

● పోలీసుల అదుపులో వ్యాపారి

● దొంగనోట్లకు బదులు

టాయ్‌ కరెన్సీ ఇచ్చాడని ఘాతుకం

● యలమంచిలి సీఐ ధనుంజయ్‌ వెల్లడి

అమలాపురం టౌన్‌: కిడ్నాప్‌నకు గురైన అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన కర్రి వర ప్రకాష్‌ది హత్యేనని అక్కడి సీఐ ధనుంజయ్‌ ఆదివారం వెల్లడించారు. దర్యాప్తు నిమిత్తం అమలాపురం వచ్చిన ఆయన మాట్లాడుతూ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీరామపురం సెంటర్‌లో షణ్ముఖ సాయి జనరల్‌ స్టోర్స్‌ నిర్వహిస్తున్న వ్యాపారి కేదారశెట్టి నాగ విజయ్‌ గణేష్‌ ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కాగా, రెండో నిందితుడు ముమ్మిడివరం మండలం మహిపాలచెరువు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ రామాంజనేయులని ఆయన తెలిపారు. దొంగనోట్ల మార్పిడిలో జరిగిన మోసమే ప్రకాష్‌ హత్యకు దారి తీసినట్టు ఆయన అన్నారు. ఇక్కడి వ్యాపారి నాగ విజయ్‌ గణేష్‌ ఇంటికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని వరప్రకాష్‌ను హత్య చేసిన అల్లవరం మండలం గోడిలంక శ్మశానానికి వెళ్లి దర్యాప్తు చేశారు. కాగా రెండో నిందితుడు రామాంజనేయులు పరారీలో ఉన్నట్టు ఆయన తెలిపారు.

హత్య జరిగిందిలా..

అమలాపురం వ్యాపారి నాగ విజయ్‌ గణేష్‌, అతడికి పరిచయస్తుడైన రామాంజనేయులు అక్రమ సంపాదనలో భాగంగా యలమంచిలికి చెందిన రమేష్‌, మరో ఇద్దరు వ్యక్తులకు అసలు నగదు ఇస్తే వారు బ్లాక్‌ మనీ ఇస్తారని తెలిపాడు. దీంతో వారిద్దరూ ఈ నెల 18న యలమంచిలికి చెందిన ముగ్గురినీ రాజమహేంద్రవరంలో కలుసుకున్నారు. వచ్చిన ముగ్గురూ ఒకే రకమైన బ్యాగ్‌లు తీసుకురాగా గణేష్‌, రామాంజనేయులు వారి వద్ద ఉన్న రూ.10 లక్షల అసలునోట్లు ఇచ్చి దొంగనోట్లను తీసుకున్నారు. ఇంతలో చిన్న పని ఉందని నమ్మించి రమేష్‌ అసలు నోట్లు పట్టుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. మిగిలిన వారు కూడా వెళ్లిపోబోతుండగా రమేష్‌ వచ్చేవరకు ఉండాలని ఆదేశించాడు. అతడు ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి బ్యాగ్‌లు తెరిచి చూడగా దొంగనోట్లు కాకుండా చిన్నపిల్లలు ఆడుకునే టాయ్‌ కరెన్సీ ఉన్నట్టు వ్యాపారి గుర్తించాడు. దీంతో వారిని పట్టుకోబోతుండగా వారు పలుగు పెట్టారు. ఈ క్రమంలో వ్యాపారికి వర ప్రకాష్‌ దొరికిపోయాడు. దీంతో వ్యాపారితో పాటు రామాంజనేయులు అతడిని కారులో అమలాపురం తీసుకువచ్చి గోడిలంక శ్మశానంలో గట్టిగా కొట్టారు. దీంతో అతడు చనిపోయాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ మృతదేహాన్ని అర్ధరాత్రి వేళ ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు తీసుకువచ్చి గోదావరిలో విసిరేశారు. 18వ తేదీ తెల్లవారు జామున వారు ఆ మృతదేహాన్ని గోదావరిలో పడేసినట్లు యలమంచిలి పోలీసులు తమ విచారణలో గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement