వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఆత్రేయపురం: గోవింద.. హరి గోవింద నామ స్మరణ మార్మోగింది. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది. ఏడు ప్రదక్షిణలు, ఏడేడు జన్మల పుణ్యఫలంగా భావించి స్వామివారిని సుమారు లక్షకు పైగా భక్తులు శనివారం దర్శించుకున్నారని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తు లు కాలినడకన సైతం వచ్చారు. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీహోమం, బాల భోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేంచేసియున్న క్షేత్రపాలకులు, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వకుళామాత అన్నదాన భవనంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రూ.54,65,715 ఆదాయం సమకూరింది. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


