● ఊపందుకున్న ఊహాగానాలు
● కార్తికమాసం నాటికి
నియమిస్తారంటూ ప్రచారం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానానికి త్వరలోనే కొత్త ఈఓ వస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. రెవెన్యూ విభాగానికి చెందిన ఒక మహిళా అధికారి డైరెక్ట్‌గా రాష్ట్ర ప్రభుత్వంలోని చినబాబు అండతో ప్రయత్నాలు చేస్తుండగా, పాత ఈఓ ఒకరు మళ్లీ ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దేవదాయశాఖ ఉన్నతాధికారులు మాత్రం రెవెన్యూ విభాగ అధికారి కన్నా దేవదాయశాఖ అధికారినే నియమించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా కోనసీమలోని వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆరు నెలలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తలుపులమ్మ దేవస్థానం ఈఓ విశ్వనాథరాజును వాడపల్లికి నియమించి, సూర్యచక్రధరరావును అన్నవరానికి రెగ్యులర్‌గా, తలుపులమ్మ దేవస్థానానికి ఇన్‌చార్జిగా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. కార్తికమాసం లోపు ఈ మార్పులు జరగవచ్చని సమాచారం.
వారానికి మూడు రోజులు
ప్రస్తుతం ఇన్‌చార్జి ఈవోగా పనిచేస్తున్న సూర్యచక్రధరరావు అన్నవరంలో మూడు రోజులు, వాడపల్లి దేవస్థానంలో నాలుగు రోజులు పనిచేస్తున్నారు. వాడపల్లికి ఇటీవల కాలంలో భక్తుల రాక బాగా పెరిగింది. శనివారం రోజు సుమారు లక్షకు పైగా వస్తుండడంతో ఈవో శుక్రవారం నుంచి అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ ఆదివారం మధ్యాహ్నం నుంచి మూడు రోజుల పాటు అన్నవరం దేవస్థానంలో ఉంటున్నారు. మధ్యలో క్యాంపులు, వాడపల్లిలో ఇతర కార్యక్రమాలకు హాజరు కావాల్సి వస్తోంది. వాస్తవానికి వాడపల్లి అంత కాకపోయినా శని, ఆదివారాలలో సత్యదేవుని ఆలయానికి కూడా భక్తులు పోటెత్తుతారు. శనివారం పూర్తిగా, ఆదివారం మధ్యాహ్నం వరకు ఈఓ అన్నవరం దేవస్థానంలో ఉండకపోవడం సమస్యగా మారింది. అయితే ఈవో లేని రోజుల్లో మిగిలిన ఉద్యోగుల పర్యవేక్షణ ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి.


