అల్లవరం: మెగా డీఎస్పీ నియమకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై కేసులు నమోదు చేసి, రౌడీ షీట్లు ఓపెన్ చేయడాన్ని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రశ్నించే హక్కును కాలరాస్తోందన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం, జైల్లో పెట్టడం పరిపాటిగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. డీఎస్సీలో అక్రమాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో 51 మందిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై ఽమండిపడ్డారు.
డీఎస్సీ నియమకాల్లో తప్పుల మీద తప్పులు చేసిన కూటమి ప్రభుత్వం, ఆ తప్పులను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం చాలా దారుణమని అన్నారు. డీఎస్సీ నియమకాల్లో పారదర్శకతపై తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విజయవాడ శాప్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కొంత మందిపై కేసులు పెట్టడం, మరికొందరిపై కఠిన చర్యలకు పాల్పడడం ద్వారా అసలు సమస్యను ప్రభుత్వం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిండం, నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దీనిని కాలరాస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీకి వంత పాడటం మానుకోవాలని హితవు పలికారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అనురాధ అన్నారు.


