ఏం తినాలో
అర్థం కావడం లేదు
ఇదివరకు రూ.150కి చేతి సంచి నిండా కూరగాయలు వచ్చేవి.. ఇప్పుడు రూ.500 పెట్టినా సంచి నిండటం లేదు. ఉల్లిపాయల ధర పెరగడంతో పులుసుతో పూట గడపడం కూడా భారంగా మారింది. కర్రీ పాయింట్‌లో రూ.15 ఉన్న ప్యాకెట్ కూర ఇప్పుడు రూ.20కి చేరింది. ప్రతి వస్తువుకూ ధర పెరుగుతుండటంతో ఏం కొనాలో.. ఏం తినాలో అర్థం కావడం లేదు.
– పోతుల చంద్రావతి,
గృహిణి, కొత్తపేట
బియ్యం ధరలు
ఎక్కువయ్యాయి
ఇటీవల బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. పెరిగిన ధరల వల్ల రోజుకు అదనంగా రూ.30 ఖర్చవుతోంది. మా కుటుంబంలో ఎనిమిది మంది సభ్యులున్నారు. ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా పడుతోంది.
– కర్రి గనికమ్మ,
కర్రివానిరేవు,
ముమ్మిడివరం మండలం
సాక్షి, అమలాపురం: ప్రస్తుత మార్కెట్‌లో పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, నూనెలు, కూరగాయలు, పెట్రోల్, డీజిల్ ఇలా పెరుగుతున్న ధరలు చూస్తే సామాన్యుల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. ఆదాయం మాత్రం అదే స్థాయిలో ఉండటంతో నెలాఖరుకు వచ్చేసరికి చేతిలో మిగిలేది ఏమీ ఉండటం లేదని మధ్యతరగతి కుటుంబాలు వాపోతున్నాయి. ధరల పెరుగుదలతో ఇప్పటికే కుటుంబ అవసరాల్లో కోతలు పెట్టుకుంటున్న సామాన్యులు.. పొదుపు, పిల్లల చదువు, వైద్యం వంటి భవిష్యత్ అవసరాలపై మాత్రం ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
ఒక్కసారిగా ‘ఉల్లి’క్కిపాటు
కోస్తేనే కన్నీళ్లు తెచ్చే ఉల్లిపాయ, ఈ రోజుల్లో మార్కెట్‌లో దాని ధర చూస్తేనే కళ్లలో నీరు తెప్పిస్తోంది. కూరల్లో ఉల్లి లేకపోతే రుచి లేదు.. మార్కెట్‌లో కొనేందుకు జేబులో డబ్బు లేదు! బంగారంతో పోటీ పడుతున్నట్టు ఉల్లి రేటు పెరుగుతోంది. గత నెల రోజుల వ్యవధిలో ఉల్లిపాయ ధర గణనీయంగా పెరిగింది. కర్నూలు తదితర ప్రాంతాల నుంచి సాధారణంగా వచ్చే ఉల్లిపాయల సరఫరాలో మార్పులు రావడం, ఇతర ప్రాంతాల నుంచి సరుకు తీసుకురావాల్సి రావడం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు హోల్‌సేల్ మార్కెట్‌లో భారీగా సరకును నిల్వ ఉంచడం, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం వంటి అంశాలు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.65 పైమాటే ఉంది. నెల రోజుల్లో కిలో రూ.25 నుంచి ఈ మొత్తానికి పెరిగిపోవడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
ముద్ద దిగక..
పెరుగుతున్న బియ్యం ధరతో సామాన్యుల నోటికి ముద్ద చేరడం లేదు. రేషన్ బియ్యం తినలేక, బయట మార్కెట్‌లో కొనలేక సామాన్యులు నలిగిపోతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు సైతం నాణ్యతను బట్టి మార్కెట్‌లో బియ్యం కొనుగోలు చేయాల్సి వస్తోంది. వివిధ రకాల బియ్యం ధరలు పెరగడంతో నెలకు అవసరమైన బియ్యం కోసం అదనపు ఖర్చు అవుతోంది. 25 కిలోల సన్న బియ్యం బస్తా రూ.2 వేలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నెల రోజుల క్రితం అదే బస్తా రూ.1400 ఉండగా, ఒక్కసారిగా రూ.600 పెరిగింది.
బియ్యం ధరలు (కేజీకి)
బీపీటీ రకాలు : రూ.65
హెచ్‌ఎంటీ రకాలు : రూ.72
రా రైస్ : రూ.72
హెచ్‌ఎంటీ మసర్ : రూ.56
నిత్యావసరాలు
పంచదార : రూ.65
మినప్పప్పు : రూ.130
మినపగుళ్లు : రూ.170
కందిపప్పు : రూ.150
శనగపప్పు : రూ.100
వేరుశెనగ గుళు : రూ.170
ఏపీ శనగపప్పు : రూ.110
చింతపండు : రూ.140
పెసరపప్పు : రూ.130
మైదా : రూ.60
బియ్యం నూక : రూ.55
కరాచీ : రూ.60
వంటనూనె : రూ.182
జీడిపప్పు : రూ.450
వెల్లుల్లి : రూ.320
ఎండుమిర్చి : రూ.320
కారం : రూ.250
ఉప్పు ప్యాకెట్ : రూ.30
బెల్లం : రూ.75
కూరగాయల ధరలు
ఉల్లిపాయలు : రూ.60 నుంచి రూ.70
వంకాయలు : రూ.60
పచ్చి మిర్చి : రూ.60
చిక్కుడుకాయ : రూ.120
క్యారెట్ : రూ.50 నుంచి రూ.60
పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్ లీటరు : రూ.117.41
డీజిల్ లీటరు : రూ.104.49
గ్యాస్ ధరలు
గృహ సిలిండర్ : రూ.972
(14 కేజీలు)
వాణిజ్య సిలిండర్ : రూ.2866
(19 కేజీలు)
పెరుగుతున్న ధరలు..
తరిగిపోతున్న ఆదాయం
బియ్యం, పప్పులు, నూనె,
కూరగాయల ధరల మోత
పెట్రోల్, డీజిల్, గ్యాస్ భారం అదనం
నెలవారీ కుటుంబ బడ్జెట్ తారుమారు
ఆదాయం పెరగక.. ఖర్చులు మాత్రం
పెరుగుతూ సామాన్యుల అవస్థలు
ఆర్థికంగా చితికిపోతున్న
పేద కుటుంబాలు
ఇంధన ధరల భారం అన్నింటిపైనా పడుతోంది
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కేవలం వాహనదారులపైనే కాకుండా రవాణా వ్యవస్థ ద్వారా అన్ని వస్తువుల ధరలపైనా ప్రభావం చూపుతోంది. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయలు, కిరాణా సరకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. యుద్ధం తరువాత డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల కూడా ఇప్పుడు నిత్యావసర, కూరగాయల ధరలు పెరగడానికి కారణమైంది.
– తాడి వెంకటరెడ్డి, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్,
మొగలిపాలెం, రామచంద్రపురం మండలం
రూ.20 వేలు సరిపోవడం లేదు
ధరల పెరుగుదలతో కుటుంబ నెలవారీ బడ్జెట్ రెట్టింపైంది. రూ.20 వేలు ఒక మూలకు రావడం లేదు. తినడానికి కొనుక్కునేవాటికి పిల్లల చదువు, ప్రయాణ ఖర్చులను కూడా కలుపుకుంటే రూ.30 వేలు దాటుతోంది. ఆదాయం పెరగలేదు.. కానీ ఖర్చులు మాత్రం రెండు, మూడు రెట్లు పెరిగాయి.
– గున్నేపల్లి భీమ్ శంకర్, ముస్లిం వీధి, అమలాపురం


