ధాన్యం సేకరణలో సహకరించాలి : డీటీవో | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణలో సహకరించాలి : డీటీవో

Sep 21 2026 12:14 AM | Updated on Sep 21 2026 12:14 AM

అమలాపురం రూరల్‌: జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు వాహన యజమానులు సహకరించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ధాన్యం సేకరణలో సరిపడా వాహనాలను సమకూర్చడం కీలక అంశమని, ట్రాక్టర్‌ ట్రైలర్‌, లారీల యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రైతు సేవా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. జీపీఎస్‌ ట్రాకర్‌ విధిగా ప్రతి వాహనానికీ అమర్చుకోవాలని చెప్పారు. ఇందుకు లారీ యజమానుల సంఘం సహకరించాలని పేర్కొన్నారు.

పోరాడేందుకు

మళ్లీ అవకాశమివ్వండి

ఎమ్మెల్సీ గోపిమూర్తి

అమలాపురం టౌన్‌: ఉపాధ్యాయ సమస్యలపై పోరాడేందుకు తనను మరోసారి ఎన్నుకోవాలని ఎమ్మెల్సీ గోపిమూర్తి కోరారు. యూటీఎఫ్‌ జిల్లా శాఖ మధ్యంతర కౌన్సిల్‌ సమావేశం స్థానిక సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా గోపిమూర్తి తనకు ఎమ్మెల్సీగా మళ్లీ అవకాశమివ్వాలని కోరారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రమణ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తిని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి జ్యోతిబసు మాట్లాడుతూ ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఐవీ వెంకటేశ్వరరావు, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీఏఎస్‌ సుబ్బారావు, నేతలు పెంకే వెంకటేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌˘

అమలాపురం రూరల్‌: అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం యథావిధిగా జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వైఖోమ్‌ నిడియా దేవి తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజన్‌, మండల తహసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో పీజీఆర్‌ఎస్‌ అర్జీలను స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

ముందస్తు అరెస్టులు

చట్ట వ్యతిరేకం

ఐలు జిల్లా ప్రధాన కార్యదర్శి

గుదిమెళ్ళ శ్రీ భాస్కరాచార్యులు

పిఠాపురం: ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలను ముందస్తు అరెస్టుల పేరుతో అదుపులోకి తీసుకోవడం, గృహ నిర్బంధాలకు పాల్పడడం చట్ట వ్యతిరేకమని, అప్రజాస్వామికమని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) జిల్లా ప్రధాన కార్యదర్శి గుదిమెళ్ళ శ్రీభాస్కరాచార్యులు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. చట్ట ప్రకారం, నిబంధనల మేరకు వ్యవహరించాల్సిన పోలీసులు వాటిని పక్కనపెట్టి అధికార పార్టీ మెప్పు కోసం కాకినాడ జిల్లాలో సీపీఎం, సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టుల పేరుతో పోలీస్‌ స్టేషన్లకు తరలించడం, గృహనిర్బంధాలకు పాల్పడటం, వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇటువంటి పద్ధతులు ప్రజాస్వామ్యంలో మంచివి కాదని హితవు పలికారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, మంత్రులకు వారు జిల్లాకు వచ్చినప్పుడు ఆ ప్రజలు సంఘాల ఆధ్వర్యంలో తమ కష్టాలు, సమస్యలు చెప్పుకొనే, వినతి పత్రాలు సమర్పించుకునే అవకాశం లేకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ పర్యటన నేపథ్యంలో సీపీఎం, సీఐటీయూ ప్రజా సంఘాల నేతల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు పోలీసులు దిగారని తెలిపారు. కాకినాడ రూరల్‌ మండలం సీఐటీయూ కార్యదర్శి టి.రాజా ఆసుపత్రి పనిమీద వెళ్తున్నప్పటికీ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. భవిష్యత్తులో జిల్లాలో సీఎం, మంత్రుల పర్యటన సందర్భంగా ప్రతిపక్షాల, ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టుల పేరుతో అదుపులోకి తీసుకోకుండా, గృహనిర్బంధాలకు పాల్పడకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఇవ్వాలని, ప్రజల రాజ్యాంగపరమైన హక్కులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement