అమలాపురం టౌన్: ఆటోలో ప్రయాణికురాలు మరచిపోయిన బంగారు ఆభరణాల బ్యాగ్‌ను డ్రైవర్ పోలేటి సతీష్ స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి తన నిజాయతీని చాటుకున్న ఘటన ఆదివారం జరిగింది. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన నల్లి వనిత అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో టీబీ జిల్లా సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. స్థానిక ఎర్ర వంతెన వద్దనున్న వసతి గృహంలో ఉంటున్నారు. సొంతూరు వెళ్లిన ఆమె తిరిగి హాస్టల్‌కు వచ్చేందుకు ఆదివారం రాత్రి 7.30 గంటలకు అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లో రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌తో ఆటో ఎక్కారు. ఎర్రవంతెన వద్దకు వెళ్లిన తర్వాత బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయి దిగిపోయారు. దీంతో బ్యాగ్‌ను గమనించిన అయినవిల్లికి చెందిన ఆటో డ్రైవర్ సతీష్ తక్షణమే పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి సీఐ పి.వీరబాబుకు అప్పగించాడు. తర్వాత వనిత కొద్దిసేపటికి తన నగలు పోయినట్టు ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అప్పటికే ఆటో డ్రైవర్ సతీష్ బ్యాగ్‌ను తీసుకొచ్చి ఇచ్చిన విషయాన్ని ఆమెకు వివరించిన పోలీసులు బ్యాగ్‌ను ఆమెకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ సతీష్ నిజాయతీని మెచ్చి సీఐ వీరబాబు, పట్టణ ఎస్సైలు కిషోర్‌బాబు, శ్రీనివాసరావు, జోషిల సమక్షంలో ఘనంగా సత్కరించి అభినందించారు. సతీష్‌కు వనిత కృతజ్ఞతలు తెలిపారు.
రూ.6 లక్షల బంగారు
ఆభరణాల బ్యాగ్ పోలీసులకు అప్పగింత


