● పుష్కర కాలంలో రెండో అత్యల్ప ఇన్‌ఫ్లో
● 2017లో అతి తక్కువగా
1291.80 టీఎంసీలు
● ఈ ఏడాది మరింత దిగువకు
● సెప్టెంబరు 18 నాటికి
1102.801 టీఎంసీలే
● డిసెంబరు నాటికి పెరిగినా పెద్దగా
ఆశాజనకం కాదంటున్న నిపుణులు
● రబీ గట్టెక్కాలంటే కనీసం
3 వేల టీఎంసీల ఇన్‌ఫ్లో అవసరం
● అప్పుడే రబీ కాలంలో
సహజ జలాల రాక
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా రైతాంగంలో రబీపై మళ్లీ ఆందోళన మొదలైంది. పుష్కర కాలంలో గోదావరిలో ఇన్‌ఫ్లో ఈ స్థాయిలో తగ్గిపోవడం రైతులను కలవరపెడుతోంది. ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి వస్తున్న నీటి ప్రవాహ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత స్పష్టమవుతోంది. గత పుష్కర కాలంలో అత్యల్పంగా 2017లో 1291.80 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదైంది. ఆ తర్వాత ఈ ఏడాదే అత్యల్ప స్థాయికి ఇన్‌ఫ్లో పడిపోయింది. అప్పుడూ ఇప్పుడూ చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉండటం గమనార్హం. జనవరి ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 18 వరకు బ్యారేజీకి కేవలం 1102.801 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. ఈ ఏడాది ఇన్‌ఫ్లో 2017 కన్నా కొంతమేర పెరిగే అవకాశమున్నా అది రబీ సాగుకు మేలు చేసే స్థాయిలో ఉండదని సాగునీటిపారుదల నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయానికి 1,93,633 క్యూసెక్కులు ఉంది. దిగువకు 1,80,333 క్యూసెక్కులు విడుదల చేశారు. మూడు రోజుల క్రితం తెలంగాణలో వర్షాలు పడడం వల్ల కొంత వరకు ఇన్‌ఫ్లో పెరిగింది. రెండు మూడు రోజుల్లో తిరిగి తగ్గిపోనుంది.
బాబు కాలంలో గడ్డు పరిస్థితులు...
గత పుష్కర కాలంలో గోదావరి కనిష్ట స్థాయిలో నీటి ప్రవాహాలు చూసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలంలోనే కావడం గమనార్హం. అసలు బాబు కాలంలోనే గోదావరిలో సగటు నీటి ప్రవాహాలు తక్కువగా ఉన్నాయి. 2015 నుంచి 2018 వరకు సగటు 2232.63 టీఎంసీలు కాగా, 2019 నుంచి 2023 వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాలంలో నమోదైన సగటు ఇన్‌ఫ్లో 4012.24 టీఎంసీలు కావడం గమనార్హం.
రబీకి నీటి భరోసా ఎక్కడ?
గోదావరి డెల్టా పరిధిలో మొత్తం 10.53 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో రబీ వరి సాగు సుమారు 8.96 లక్షల ఎకరాలు. ఖరీఫ్ సీజన్ మరో నెల రోజుల్లో ముగింపు దశకు చేరుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే రబీ సాగుకు అవసరమైన నీటి లభ్యతపై డెల్టా రైతుల్లో ఆందోళన నెలకొంది. ఏడాది మొత్తంలో కనీసం మూడువేల టీఎంసీల స్థాయిలో ఇన్‌ఫ్లో ఉండాలని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగైతేనే రబీ కాలంలో కనీసం 25 టీఎంసీల వరకు సహజ జలాల లభ్యత ఉంటుందని చెబుతున్నారు. ఈ స్థాయిలో నీరుంటేనే సీలేరు నుంచి వచ్చే 45 టీఎంసీలకు తోడు, పోలవరం వద్ద నిల్వ ఉండే నీరు కలిపి మొత్తం 90 టీఎంసీలు వస్తోందని, అప్పుడే డెల్టాలో మొత్తం రబీ సాగుకు బొటాబొటీగా నీరందించవచ్చని అంచనా. ధవళేళ్వరం బ్యారేజ్ వద్ద సెప్టెంబరు 18 నాటికే ఇన్‌ఫ్లో కేవలం 1102.801 టీఎంసీల వద్ద ఉండటంతో మిగిలిన కాలంలో ఎంతమేర నీరు చేరుతుందనేది కీలకంగా మారింది. గోదావరి క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిస్తే తప్ప ఇప్పుడున్న ఇన్‌ఫ్లో పరిగణనలోకి తీసుకుంటే డిసెంబరు నాటికి 1500 టీఎంసీల నీరొస్తే చాలా అద్భుతమనే చెప్పాలి. అవసరమైన దానిలో సగం కన్నా నీరు తక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో రబీ సాగుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖరీఫ్‌లోనే కష్టాలు
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఈ ఏడాది గోదావరి డెల్టాలో ఖరీఫ్ ఆరంభం నుంచే సాగునీటి సమస్య రైతులను వెంటాడుతోంది. ప్రధాన కాలువలకు నీరు విడుదల చేసినప్పటికీ శివారు ప్రాంతాల్లోని పంట కాలువలకు సకాలంలో నీరు చేరకపోవడంతో అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లోని పలు చోట్ల నారుమడులు ఎండిపోయి రైతులు కాలువల్లోకి దిగి నిరసనలు చేశారు. నీరున్నప్పుడే కాలువల ద్వారా చేలకు అందించలేని చంద్రబాబు ప్రభుత్వం గోదావరిలో రబీ సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే చేతులెత్తేయడం మినహా మరో మార్గం లేదని రైతులు భయపడుతున్నారు. అందుబాటులోకి వచ్చే నీటిని ముందుగానే అంచనా వేసుకుని రబీ సాగుకు ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
సంవత్సరం : ఇన్‌ఫ్లో (టీఎంసీలు)
2015 : 1859.31
2016 : 3101.66
2017 : 1291.80
2018 : 2677.73
2019 : 4041.49
2020 : 3706.88
2021 : 2728.17
2022 : 6489.81
2023 : 3094.83
2024 : 4371.63
2025 : 4902.31
2026 : 1102.801
(సెప్టెంబరు 18 వరకు)


