ఆలమూరు: మండలంలోని పెదపళ్లకు చెందిన దివ్యాంగులైన ఇలపర్తి ఉమాదేవి, సుంకర శ్రీనివాసుకు పింఛన్ దరఖాస్తులను తిరస్కరించడంపై ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దివ్యాంగులైన వారిద్దరూ సుమారు 90 శాతం అంగవైకల్యంతో తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. తమ పని సైతం తాము చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన సదరం సర్టిఫికెట్‌లో వారికి 90 శాతం అంగవైకల్యాన్ని నమోదు చేసినా ‘టెంపరరీ’ అని పేర్కొనడం వారి పాలిట శాపంగా మారింది. వారిద్దరూ ఆన్‌లైన్‌లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా అవి తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై ఆగ్రహం చెందిన దివ్యాంగుల కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ ఆవేదనను కూటమి నేతల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోలేదని వారు వాపోయారు. వైద్యారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అసలైన దివ్యాంగులకు టెంపరరీ సర్టిఫికెట్ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ వారి కుటుంబ సభ్యులు పార్టీలకతీతంగా పలువురు నేతలను తీసుకువెళ్లి ఆలమూరులో తహసీల్దార్ కందుల కుశరాజు, ఎంపీడీఓ ఎ.రాజు, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీ ప్రత్యూషకు ఫిర్యాదు చేశారు.


