● కొబ్బరి చిప్ప బొగ్గు ధరకు రెక్కలు
● గతంలో టన్ను ఽగరిష్ట ధర రూ.38 వేలు
● ఇప్పుడు రూ.75 వేలకు పైబడి
● కేరళ, తమిళనాడు కన్నా
కోనసీమ చిప్పకు డిమాండ్
● స్థానికంగా చిప్పలు దొరకక ఇబ్బంది
● కొబ్బరికాయ నేరుగా ఎగుమతి వల్లే అసలు అనర్థం
సాక్షి, అమలాపురం: కొబ్బరి చిప్పకు.. ఆ చిప్పలతో తయారు చేసిన బొగ్గుకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. గతంలో టన్ను గరిష్టంగా రూ.38 వేల వరకు పలికిన కొబ్బరి చిప్ప బొగ్గు.. ప్రస్తుతం రూ.75 వేలకు పైబడి ధర ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో టన్ను ధర రూ.లక్షకు చేరినా ఆశ్చర్యం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ నాణ్యత దేశం దాటి అంతర్జాతీయ సరిహద్దులకు చేరింది. వైనతేయ నదీ తీరంలో పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో ఏడాదికి సుమారు 1100 టన్నుల చిప్ప బొగ్గు ఉత్పత్తి అవుతోందని అంచనా. ఇక్కడి నుంచి తమిళనాడు కాంగాయం, పల్లడం, కోయంబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు నెల్లూరు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ దీనిని మరింత నాణ్యంగా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
నేరుగా ఎగుమతులతో..
చిప్ప బొగ్గు ధర టన్ను రూ.75 వేలు దాటినా స్థానిక వ్యాపారులు, తయారీదారులకు ప్రయోజనం లేదు. గత కొన్ని నెలులుగా కొబ్బరి చిప్ప లభ్యత లేదు. గతంలో ఉభయ గోదావరి జిల్లాల్లో 60 శాతం కొబ్బరి ఎండు కొబ్బరిగా మార్చేవారు. దీనివల్ల అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఏలూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల ప్రాంతాల్లో చిప్ప విరివిగా దొరికేది. ఇప్పుడు కొబ్బరి ధర పెరగడంతో కాయ నేరుగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. కుళ్లిన కొబ్బరి కాయ కూడా ఎగుమతి జరుగుతోంది. ఆలయాల నుంచి వచ్చే చిప్ప మాత్రమే వస్తోంది. కిలో చిప్ప ధర కూడా రూ.5 నుంచి రూ.35కు పెరిగింది. గతంలో అప్పటికప్పుడు కావాలంటే 50 నుంచి 70 టన్నుల బొగ్గును స్థానికంగా సేకరించేవారమని, ఇప్పుడు టన్ను బొగ్గు కూడా సేకరించలేకపోతున్నామని పి.గన్నవరం మండలం ముంజువరానికి చెందిన తయారీదారుడు మట్టపర్తి రామకృష్ణ ‘సాక్షి’ వద్ద వాపోయారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ బొగ్గు కొనేవారు ఇప్పుడు నేరుగా చిప్పనే కొంటున్నారని, దీనివల్ల చిప్ప దొరకడం లేదని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సుమారు వెయ్యి కుటుంబాలు ప్రస్తుతం ఉపాధిని కోల్పోయాయి.
అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో..
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైనది. చిప్ప దళసరిగా ఉండడంతో దీనిలో అధిక శాతం గ్యాస్ నిక్షిప్తమై వేగంగా మండుతుంది. సేంద్రియ కర్బనం ఉత్పత్తి అవుతుంది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో ధర అంచనాలకు మించి పెరిగింది. గత ఏడాది వరకు బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కిలో రూ.35 నుంచి రూ.38 వరకు ఉండేది. ఇప్పుడు అది కాస్తా రూ.75 దాటింది. త్వరలో కిలో రూ.100 అవుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.


