ఇంటింటా సర్వేపై అనుమానాలు | - | Sakshi
Sakshi News home page

ఇంటింటా సర్వేపై అనుమానాలు

Sep 13 2026 12:24 AM | Updated on Sep 13 2026 12:24 AM

ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌

అల్లవరం: అమలాపురం మున్సిపాలిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మహిళా ఓటర్ల సర్వే ఇంటింటికీ వెళ్లి నిర్వహించకుండా, ఏసీ గదుల్లో కూర్చుని మొక్కుబడిగా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఈ నెల ఐదున జారీ చేసిన జీవో ప్రకారం ఈ నెల 8 నుంచి 12 వరకు సర్వే నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. అమలాపురం మున్సిపాలిటీలో క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించలేదని స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయని తెలిపారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని, దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా ఓటర్ల సర్వేని ఇంటింటికీ వెళ్లి చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సర్వే పూర్తయిన తర్వాత జాబితాను పారదర్శకంగా పరిశీలించి అభ్యంతరాలకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. వాస్తవ ఓటర్ల సర్వే ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏదైనా అవకతవకలు జరిగితే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తామని ఇజ్రాయిల్‌ హెచ్చరించారు.

వర్షంలోనూ

వాడపల్లికి తగ్గని రద్దీ

ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వర్షాలను సైతం లెక్కచేయకుండా శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 1,03,668 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన సైతం స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం వంటి కార్యక్రమాలను అర్చకులు, వేదపండితులు ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ఆదాయం రూ. 65,93,892 వచ్చింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఉచిత అన్న ప్రసాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సమస్యలపై సీఎంకి మెయిల్‌

వైద్య ఆరోగ్య కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసన

అమలాపురం టౌన్‌ : తమ ఉద్యోగాలను రెగ్యులైజ్‌ చేయాలన్న డిమాండ్‌తో గత కొన్ని రోజులుగా వినూత్న రీతిలో నిరసనలు చేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ సమస్యలు, డిమాండ్లపై మెయిల్‌ పంపించారు. ‘మెయిల్‌ టు సీఎం’ పేరిట జేఏసీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సుల అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి బి.అచ్యుతవల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షురాలు ఎం.శివకుమారి, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి.

అన్నవరం దేవస్థానానికి కొత్త బస్సులు

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి విచ్చేసే భక్తుల కొరకు దేవస్థానం కొనుగోలు చేసిన రెండు కొత్త బస్సులను ఆదివారం ప్రారంభిస్తున్నారు. ఈ బస్సుల ఛాసిస్‌ కొనుగోలు, తరువాత బాడీ బిల్డింగ్‌కు మొత్తం రూ.90 లక్షలు వ్యయమైందని అధికారులు తెలిపారు. 36 సీటింగ్‌తో ఉండే ఈ బస్సులకు హైదరాబాద్‌లోనే బాడీ బిల్డింగ్‌ చేయించినట్టు అధికారులు చెప్పారు. సత్యదేవుని ఆలయానికి రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌ల నుంచి భక్తులు రత్నగిరికి రాకపోకలు సాగించేందుకు, సత్యగిరి, రత్నగిరి మధ్య ఉచిత బస్సు సర్వీసు కలిపి దేవస్థానానికి ప్రస్తుతం 11 బస్సులు ఉన్నాయి. వీటిలో 15 సంవత్సరాల సర్వీసు పూర్తయిన రెండు బస్సులను త్వరలో ఉపసంహరించనున్నారు. వాటి స్థానంలో ఈ కొత్త బస్సులను ప్రవేశపెడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement