ఏమనుకొంటున్నారో..? | - | Sakshi
Sakshi News home page

ఏమనుకొంటున్నారో..?

Mar 2 2026 7:33 AM | Updated on Mar 2 2026 7:33 AM

ఏమనుక

ఏమనుకొంటున్నారో..?

దళారుల దోపిడీకి రైతు బలి

కూరగాయల అమ్మకాలకు కష్టాలు

ధర తగ్గించి కొని.. ఎక్కువకు విక్రయించి

తీవ్రంగా నష్టపోతున్న ఉద్యాన రైతులు

ఆలమూరు: రైతులకు కూర‘గాయాలు’ తప్పడం లేదు. పండించే రైతులకు, వినియోగదారులకు మధ్య ఉన్న దళారులు ఉన్నదంతా దోచుకుంటున్నారు. రైతుల నుంచి దళారులు తక్కువకు కొని, బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఎక్కువకు విక్రయించేలా వ్యవహారం నడిపిస్తున్నారు. గత ఏడాది జూలై నెలాఖరు నుంచి నవంబర్‌ వరకూ గోదావరికి వరద ఉండడంతో లంక గ్రామాల్లో సాగు చేయలేని పరిస్థితి ఉంది. తర్వాత వాతావరణం అనుకూలించి సాగు చేస్తే ఇప్పుడు దిగుబడి ఒకేసారి మార్కెట్‌లోకి రావడంతో ధర పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. దీనికితోడు దళారుల పాత్ర అధికమైంది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 5,800 ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతోంది. గోదావరి వరదల అనంతరం నవంబర్‌లో సాగు ప్రారంభించిన బెండ, టమోటా, వంకాయ, చిక్కుళ్లు, పచ్చిమిర్చి, దొండ తదితర కూరగాయల పంట ఫిబ్రవరి చివరి నాటికి ఒకేసారి దిగుబడికి వచ్చింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలైన ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేట, కపిలేశ్వరపురం, సీతానగరం, రాజమహేంద్రవరం రూరల్‌తో పాటు మెట్ట ప్రాంతాలైన జగ్గంపేట, రంగంపేట, గోకవరం తదితర మండలాల నుంచి ప్రతి రోజూ మడికి మార్కెట్‌కు సుమారు 800 టన్నుల వరకూ సరఫరా జరుగుతోందని అంచనా. అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్‌గా ప్రఖ్యాతి గాంచిన మడికితో పాటు రావులపాలెం, అమలాపురం మార్కెట్లకు టన్నుల కొద్దీ కూరగాయల సరఫరా జరుగుతుండటంతో ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. టమోటా ధర అయితే రవాణాకే కాదు, కోత ఖర్చులు రాని పరిస్థితి నెలకొంది. ఆరుగాలం శ్రమించే కూరగాయల రైతు తీవ్రంగా నష్టపోతుండగా.. దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఎక్కువ ధరకు విక్రయాలు జరుపుతున్నారు. దీంతో అటు రైతు, ఇటు వినియోగదారుడు నష్టపోతున్నారు.

పెట్టుబడి ఎక్కువే..

కూరగాయల పంట సాగు చేయాలంటే ఎకరాకు సగటున శిస్తుతో కలిపి రూ.లక్ష నుంచి రూ. 1.20 లక్షల వరకూ అవుతుంది. ప్రస్తుతం అంచనాలకు మించి హోల్‌సేల్‌ మార్కెట్‌కు కూరగాయలు అధికంగా వస్తుండగా, రిటైల్‌ మార్కెట్‌కు అక్కడి నుంచి ఆ స్థాయిలో సరఫరా జరగడం లేదు. దీంతో రాజమహేంద్రవరం, మడికి, రావులపాలెం, అమలాపురం వంటి మార్కెట్లలో సరకు పేరుకుపోయి అప్పుడప్పుడు రైతుల వద్ద కొనుగోలు నిలిపివేస్తున్నారు. ఇలా కొనుగోలు లేక రైతుల నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

నిలిచిపోయిన ఎగుమతులు

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పండించిన పంట అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల మడికి మార్కెట్‌ నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ఇక్కడ స్థానిక అవసరాల కంటే అధికంగా కూరగాయలు లభ్యం కావడంతో ధరల పతనానికి మరో కారణంగా మారింది. టమోటా పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో సాగు చేసిన ఈ పంట ఒకేసారి పక్వానికి వచ్చింది. ఫిబ్రవరి తొలివారం వరకూ మంచు కురవడంతో తోటల్లో పచ్చిగా ఉన్న టమోటా వాతావరణం వేడెక్కడంతో పండుగా మారి పక్వానికి వచ్చింది. సాధారణంగా తోటలో ముగ్గిన టమోటా వారంలోపు కోయకపోతే కుళ్లిపోయే అవకాశం ఉన్నందున రైతులు తమ తోటల్లోని పంటను మార్కెట్‌కు తరలిస్తున్నారు. గతేడాది నవంబర్‌ లో కిలో రూ.70 వరకూ పలికిన ధర, నేడు మడికి మా ర్కెట్‌లో రూ.ఆరు మించి పలకడం లేదు. టమోటాకు కోత ఖర్చులు కూడా రాకపోవడంతో కొంత మంది రైతులు తమ పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు.

బహిరంగ మార్కెట్‌లోనే ధరలు

బహిరంగ మార్కెట్‌లో కూరగా యల ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌ లో ధరలు తగ్గినా రిటైల్‌ షాపు ల్లో ధరలు తగ్గించక పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వినియోగదారులకు న్యాయం జరుగుతుంది.

–కోట బూరయ్య, పినపళ్ల, ఆలమూరు మండలం

దిగుబడి ఒక్కసారిగా పెరిగింది

గత ఏడాది వరదల ప్రభావం వల్ల సాగు ఆల స్యంగా ప్రారంభం కావడంతో కూరగాయల దిగుబడి ఒకేసారి వచ్చింది. దీనివల్ల స్థానిక కూరగాయలు సరఫరా అధికం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇతర జిల్లాల్లో డిమాండ్‌ లేకపోవడంతో ఎగుమతులు పడిపోవడం కూడా ధరల తగ్గుదలకు కారణమైంది.

–చెల్లుబోయిన సింహాచలం, కూరగాయల వ్యాపారి, మడికి, ఆలమూరు మండలం

కూరగాయలు రైతుకు బహిరంగ

లభించే మార్కెట్లో

కిలో రూ.ధర కిలో రూ.ధర

బెండకాయలు 22 60

వంకాయలు 10 40

దొండ 28 60

చిక్కుళ్లు 20 50

టమోటా 06 30

బీట్‌రూట్‌ 18 40

పచ్చిమిర్చి 25 60

కాలీఫ్లవర్‌ 30 60

కంద 25 55

క్యాబేజీ 20 50

కొత్తిమీర 40 70

బీరకాయలు 35 65

అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్లు కూరగాయలు పండించే రైతుల పరిస్థితి ఉంది.. దళారుల ఎత్తుగడకు బక్కచిక్కాల్సి వస్తోంది.. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు కోత కూలీ కూడా రాని పరిస్థితి వచ్చింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధర తగ్గించి కొని, బహిరంగ మార్కెట్లో ధరలు పెంచి విక్రయించడంతో పుడమి పుత్రులకు కన్నీరే మిగులుతోంది. ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితిని గమనిస్తే రైతన్న కష్టం ఏమవుతుందో తెలుస్తోంది.

ఆదుకోని కూటమి ప్రభుత్వం

కూరగాయలు సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్న ఉద్యాన రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట దళారులు, వ్యాపారులు దోచుకుతింటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో వినియోగదారుడు అధిక ధరలకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నాడు. అయినా ఎవరూ స్పందించకపోవడం శోచనీయం.

ఏమనుకొంటున్నారో..?1
1/3

ఏమనుకొంటున్నారో..?

ఏమనుకొంటున్నారో..?2
2/3

ఏమనుకొంటున్నారో..?

ఏమనుకొంటున్నారో..?3
3/3

ఏమనుకొంటున్నారో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement