● వైభవంగా అంతర్వేది నరసన్న కల్యాణం ● జనసంద్రమైన ఆలయ ప్ర
సాక్షి, అమలాపురం/ సఖినేటిపల్లి: పరమ పావనమైన వశిష్ఠ, సముద్ర సంగమ ప్రాంతంలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది. ఆది దేవుని కల్యాణంతో శోభాయమానంగా మారింది. గోవింద నామస్మరణలు, జై లక్ష్మీనరసింహస్వామి అంటూ వేలాది గొంతులు స్మరించగా, ఆ ప్రాంతం శ్రవణానందకరంగా మారింది. అంతర్వేది పుణ్యక్షేత్రంలో జగదానందకారకుడు, ఆదిదేవుడు లక్ష్మీ నృసింహుని కల్యాణం బుధవారం అర్ధరాత్రి నయనానందకరంగా సాగింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు వెల్లువలా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది.
నేత్రపర్వం
ఆది దేవుడు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి తిరు కల్యాణ మహోత్సవం నేత్ర పర్వంగా సాగింది. నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వేదిక మీద ఉంచి సుమారు నాలుగు గంటల పాటు నిర్వహించిన వివాహ వేడుకను వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగానూ, లక్షల మంది భక్తులు టీవీలలో ప్రసారం ద్వారా తిలకించారు. స్వామివారి కల్యాణం బుధవారం రాత్రి 1.56 (గురువారం తెల్లవారు జామున) గంటలకు రోహిణి నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశంలో కనుల వైకుంఠంగా సాగింది. నృసింహుని కల్యాణంతో పరమ పవిత్ర వశిష్ఠ తీరం పులకించింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, రంగురంగుల పువ్వులతో శోభాయమానంగా తయారు చేసిన కల్యాణ వేదిక, పట్టు వస్త్రాలు, బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలను ధరించిన స్వామివారు, అమ్మవార్లు సప్త వర్ణాలతో వెలిగిపోయారు. కల్యాణ మండపం చుట్టూ భారీ పందిళ్లు విద్యుద్దీపకాంతులతో మెరిసిపోయాయి.
ఎదురు సన్నాహంతో..
నరసింహస్వామివారి కల్యాణతంతు బుధవారం రాత్రి 10 గంటలకు ఎదురు సన్నాహంతో ప్రారంభమైంది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహదూర్ శ్రీవారి తరఫున, అర్చక స్వాములు అమ్మవారి తరఫున వివాహ కర్తలుగా వ్యవహరించారు. వైఖానస ఆగమానుసారం ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వెంకటశాస్త్రి పర్యవేక్షణలో అర్చక బృందం సంప్రదాయబద్ధంగా కల్యాణాన్ని నిర్వహించారు.
ఆభరణాలతో అలంకరణ
ముహూర్తానికి జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని స్వామివారి శిరసుపై ప్రధాన అర్చకుడు కిరణ్, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి శిరసులపై సహాయ అర్చకులు ఉంచారు. ఎప్పటిలాగానే శఠారి, వైరుముడి, సూర్య పతకం, చిన్ని కిరీటం, వెండి కిరీటం, సాదా కిరీటం, కంటె, పచ్చలు, కెంపులు, వజ్రాలతో పొదిగిన కిరీటం, హంస పతకం, నవరత్నాలు పొదిగిన హారం, పగడాల దండ, తొమ్మిది ఈస్ట్ ఇండియా మోహాళీలు, 12 రకాల నానుతాడులు, చిన్ని లక్ష్మీ కాసుల పేర్లతో వారిని అలంకరించారు. వీటితోపాటు అంతర్వేదికరకు చెందిన దివంగత డాక్టర్ పోతురాజు సూర్య వెంకట సత్యనారాయణ సమర్పించిన అభరణాలను సైతం అలంకరించారు. ఆనవాయితీ ప్రకారం టీటీడీ దేవస్థానం శ్రీస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించింది. రాష్ట్రం నలుమూల నుంచి సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చారు. కల్యాణోత్సానికి వచ్చిన వేలాది మంది భక్తులకు దేవస్థానం నోటిఫైడ్, ప్రైవేట్ సత్రాలు ఆకలి దప్పికలను తీర్చాయి.
నేడు రథోత్సవం
అంతర్వేదిలో స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం 2.05 గంటలకు స్వామివారి రథోత్సవం జరగనుంది. నూతన దంపతులుగా శ్రీస్వామి, అమ్మవార్లు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథయాత్రలో సోదరి గుర్రాలక్క అమ్మవారికి చీర, సారెను, శ్రీస్వామి తరఫున అర్చకులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
కల్యాణ వేదికపై లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లకు పూజలు చేస్తున్న అర్చకులు
విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతున్న ఆలయ ప్రాంగణం
లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణం చూసేందుకు తరలివచ్చిన భక్తులు
అన్నవరం నుంచి పట్టువస్త్రాలు
అన్నవరం: లక్ష్మీనరసింహస్వామికి అన్నవరం సత్యదేవుని తరఫున బుధవారం పట్టువస్త్రాలను సమర్పించారు. అన్నవరం దేవస్థానం డిఫ్యూటీ కమిషనర్ బాబూరావు, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకుడు సుధీర్, వేద పండితుడు యనమండ్ర శర్మ తదితరులు అంతర్వేదికి వెళ్లి ఆ దేవస్థానం ఈఓ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌కు వీటిని అందజేశారు. ఏటా దేవస్థానం తరఫున అంతర్వేది నరసన్నకు పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
● వైభవంగా అంతర్వేది నరసన్న కల్యాణం ● జనసంద్రమైన ఆలయ ప్ర
● వైభవంగా అంతర్వేది నరసన్న కల్యాణం ● జనసంద్రమైన ఆలయ ప్ర
● వైభవంగా అంతర్వేది నరసన్న కల్యాణం ● జనసంద్రమైన ఆలయ ప్ర
● వైభవంగా అంతర్వేది నరసన్న కల్యాణం ● జనసంద్రమైన ఆలయ ప్ర
● వైభవంగా అంతర్వేది నరసన్న కల్యాణం ● జనసంద్రమైన ఆలయ ప్ర


