మంచుతో మామిఢీ | - | Sakshi
Sakshi News home page

మంచుతో మామిఢీ

Jan 29 2026 6:13 AM | Updated on Jan 29 2026 6:13 AM

మంచుత

మంచుతో మామిఢీ

తెగుళ్లపై జాగ్రత్తలు అవసరం

సస్యరక్షణతో అధిక దిగుబడి

రాయవరం/ప్రత్తిపాడు: మామిడి ఇప్పుడిప్పుడే పూత దశకు చేరుకుంటోంది. పూత పిందెగా మారి తేనే రైతులకు లాభం. ప్రస్తుతం కురుస్తున్న మంచు, చలితో తెగుళ్లు విజృంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచుకు పూత మాడిపోయే అవకాశం ఉంది. తేనె మంచు పురుగు, ఆకు జల్లెడ గూడు పురుగు, పచ్చ పురుగు, పక్షికన్ను మచ్చ, బూడిద తెగుళ్లు వంటివి ఆశించే అవకాశం ఉంటుంది. తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి బాగుంటుందని అధికారులు వివరిస్తున్నారు.

తేనె మంచు పురుగు

మేంగో హోపర్‌గా పిలిచే తేనెమంచు తల్లి పురుగులు, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పూతకాడలు, పూలు, లేతపిందెల రసాన్ని పీల్చేస్తాయి. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు పూత ఎక్కువగా ఉన్న దశలోనే తేనె మంచుపురుగు ఆశిస్తుంది. ఈ పురుగులు విసర్జించిన తేనెలాంటి తియ్యని పదార్థం వల్ల మచ్చతెగులు, పూతకాడలపై, కాయలపై, ఆకులపై నల్లని మసి ఏర్పడుతుంది. ఈ తెగులు నివారణకు తోటలో నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తులో ఆయిల్‌ పూసిన పసుపురంగు బోర్డులను ఏర్పాటు చేయాలి. ఎకరానికి నాలుగు నుంచి ఐదు ఏర్పాటు చేయాలి. పువ్వుమొగ్గ దశలో లీటరు నీటికి డైక్లోరోవాస్‌ (డీడీవీపీ) 0.5 మిల్లీలీటర్ల మందును లేదా మూడు గ్రాముల కార్బరిల్‌ లీటరు నీటికి కలిపి చెట్టు బెరడు, మూలలు తడిసేలా పిచికారీ చేయాలి. దీనివల్ల మొగ్గ తొలిచే గొంగళి పురుగును కూడా నివారించవచ్చు. పచ్చిపూత దశలో 1.5 మిల్లీ లీటర్ల నుంచి రెండు మిల్లీలీటర్ల మోనో క్రోటోఫాస్‌ లేదా రెండు మిల్లీలీటర్ల డైమిథోయేట్‌, లేదా రెండు మిల్లీలీటర్ల మిథైల్‌ డెమటా లేదా 0.25 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒక చెట్టుకు 10 నుంచి 15 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పిందె దశ (నల్లపూత)లో లీటరు నీటికి ఒక మిల్లీ లీటరు పాస్పోమిడా లేదా రెండు మిల్లీలీటర్లు మిథైల్‌ డెమటాన్‌, రెండు మిల్లీ లీటర్ల డైమిథియేట్‌ లేదా ఒక గ్రాము అసిఫేట్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు

రెండు మిల్లీమీటర్ల పొడవు, జాలరు వంటి రెక్కలు కలిగి ఉండే తామర పురుగులు పూత, కాయ దశల్లో ఆశిస్తాయి. వీటి నివారణకు పాస్పోమిడా ఒక మిల్లీ లీటరు, పిప్రోనిల్‌ రెండు మిల్లీ లీటర్లు, ఎసిఫేట్‌ ఒక గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పైన సూచించిన మందులతో పాటు మూడు మిల్లీ లీటరు వేపనూనె లేదా ఐదు శాతం వేప కషాయం కలిపి పిచికారీ చేస్తే ఫలితాలు బాగుంటాయి.

పూతచుట్టు పురుగు

ఈ పురుగులు పూత గుత్తుల్ని గూడుగా ఏర్పరుచుకుని పూతను తింటుంటాయి. పూతకాడల్ని తొలుచుకుని తినడంతో పూత ఒడిలిపోయి పూతరాలి పోతుంది. దీని నివారణకు డైక్లోరోవాస్‌ (డీడీవీపీ) 0.5 మిల్లీ లీటర్లు మందును లేదా మూడు గ్రాములు కార్బరిల్‌ లీటరు నీటికి కలిపి చెట్టు బెరడు, మూలలు తడిసేలా పిచికారీ చేయాలి.

టెంకపురుగు

కాయలు గోళీ సైజులో ఉన్నప్పుడు కాయ పైభాగాన్ని గోకి గుడ్లు పెడుతుంది. పిల్ల పురుగులు కాయను తొలుచుకుని పోయి లేత టెంకపప్పును తింటాయి. కాయ ఎదిగే దశలో రంధ్రం మూసుకుపోతుంది. పిల్లపురుగు తల్లిపురుగుగా మారినప్పుడు అది విసర్జించే పదార్థాలను కండలోనికి తీసుకుని రావడం వలన కాయ కుళ్లి నాణ్యత కోల్పోతుంది. దీని నివారణకు లీటరు నీటికి ఒక మిల్లీ లీటర్ల పెంథియాన్‌, మూడు గ్రాములు కార్బరిల్‌, రెండు మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్‌ 15 రోజులకు ఒకసారి రెండు సార్లు చొప్పున పిచికారీ చేయాలి.

బూడిద తెగులు

పొడి, చల్లని, మబ్బు వాతావరణంలో బూడిదతెగులు సోకడానికి అవకాశం ఉంది. లేత ఆకులు, పువ్వు, పువ్వుకాడలు, పిందెలపై తెల్లటి బూజు ఏర్పడుతుంది. దీనివల్ల పూలు, పిందెలు రాలిపోతాయి. దీని నివారణకు ఎక్సాకోనజాల్‌ రెండు మిల్లీ లీటర్లు, ప్రొపికొనజోల్‌ ఒక మిల్లీ లీటరు మందును లీటరు నీటికి కలిపి పూతంతా తడిసేలా పిచికారి చేయాలి. డైనోకాప్‌ లేదా ట్రైడామార్క్‌ ఒక మిల్లీ లీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆకుమచ్చ, పూతమాడు తెగులు

వర్షాలు, పొగమంచు అధికంగా ఉంటే ఆకుమచ్చ, పూతమాడు తెగుళ్లు ఆశిస్తాయి. ఈ తెగులు వేళ్లు మినహా చెట్టంతా ఆశిస్తుంది. ఆకులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడి క్రమంగా కలిసి పోయి ఆకులు త్వరగా పండి రాలిపోతాయి. పూత నుంచి మొగ్గ బయటకు వచ్చే సమయంలో మూడు గ్రాముల కోపరాక్సిక్లోరైడ్‌ లేదా పచ్చిపూతపై ఒక గ్రాము కార్బండిజమ్‌ లేదా ఒక గ్రాము థయోఫేనేట్‌మిథైల్‌, పిందె దశలో 2.5 గ్రాముల మేంకోజబ్‌ అనే మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకు జల్లెడ గూడ పురుగు

ఈ పురుగు పూతదశలో పూతను, మొగ్గలను ఆశించి తర్వాత గుత్తులను గూడుగా ఏర్పరుస్తుంది. రసాన్ని పీల్చి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు క్వినాల్‌ ఫాస్‌ 25 ఈసీ 2 మిల్లీ లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో..

గత ఏడాది 6,605 ఎకరాల్లో మామిడి తోటలు సాగయ్యాయి. నష్టాలను చవిచూసిన రైతులు ఈ ఏడాది వెయ్యి ఎకరాల మేర ఇతర పంటల వైపు మళ్లారు. ప్రస్తుతం కొబ్బరి మామిడి, బంగినపల్లి, రసాలు, పండూరు మామిడి, పాపారావు కోవ, కలెక్టరు, సువర్ణరేఖ, ఇమాటీలు వంటి జాతి రకాలతో పాటు దేశవాళీ రకాల మామిడి తోటలను పెంచుతున్నారు. ప్రత్తిపాడు మండలంలో 1,975 ఎకరాల్లో, శంఖవరంలో 2,305, రౌతులపూడిలో 1,155, ఏలేశ్వరంలో 167 ఎకరాల్లో మామిడి తోటలను పెంచుతున్నారు.

ఇంకా పూత రాని తోటల్లో....

ఇంకా పూత రాని తోటల్లో 13–0–45 పది గ్రాములు, 3 గ్రాముల సల్ఫర్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే పూత వచ్చే అవకాశం ఉంటుంది. పూత వచ్చిన తోటల్లో పూత నిలబడడానికి, కాయ రాలడాన్ని వివారించేందుకు ఫ్లానోఫిక్స్‌ 0.2 మిల్లీ లీటర్ల నీటికి కలిపి పిందె దశలో, మళ్లీ పిందె గోళీ సైజులో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. 3 గ్రాముల సూక్ష్మ పోషకాలు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

– కె.దివ్యశ్రీ, ఉద్యానశాఖాధికారి, ప్రత్తిపాడు

జిల్లాలో 30 వేల ఎకరాలలో సాగు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 30 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ప్రధానంగా బంగినపల్లి, కలెక్టరు, పెద్దరసం, చెరకురసం, కొత్తపల్లి కొబ్బరి, రాయల్‌ స్పెషల్‌, సువర్ణరేఖ వంటి రకాలు పండుతున్నాయి. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలతో పాటు కోనసీమ ప్రాంతంలో కూడా మామిడి పంట అధికంగా ఉంది.

– పి.అనూష, రామచంద్రపురం డివిజన్‌ ఉద్యాన శాఖాధికారి

మంచుతో మామిఢీ 1
1/3

మంచుతో మామిఢీ

మంచుతో మామిఢీ 2
2/3

మంచుతో మామిఢీ

మంచుతో మామిఢీ 3
3/3

మంచుతో మామిఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement