‘గంటి’ దళిత యువకులకు న్యాయం చేయాలి
● కొత్తపేటలో దళిత సంఘాల ధర్నా
● ఆర్‌డీఓ శ్రీకర్‌కు వినతిపత్రం అందజేత
కొత్తపేట: మండల పరిధిలోని గంటి గ్రామంలో దళిత యువకులపై జరిగిన కులాహంకార దాడి, అక్రమ కేసులు, కస్టోడియల్ టార్చర్‌పై విచారణ జరిపి, బాధితులను న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు బుధవారం కొత్తపేట ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశాయి. రాష్ట్ర, జిల్లా దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ‘చలో గంటి.. గంటి నుంచి కొత్తపేట ఆర్‌డీఓ కార్యాలయం వరకు ర్యాలీ’కి దళిత, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ మేరకు ర్యాలీగా ఆర్‌డీఓ కార్యాలయానికి నాయకులు, సభ్యులు చేరుకున్నారు. కిందకు వచ్చి తమ గోడు విని, వినతిపత్రం స్వీకరించాలని ఆర్‌డీఓ శ్రీకర్‌ను కోరగా, ఐదుగురు ప్రతినిధులు తన చాంబర్‌కు వచ్చి వినతిపత్రం ఇవ్వాలని ఆయన చెప్పారు. అయితే అందరి సమక్షంలో వినతిపత్రం తీసుకుని, తగిన హామీ ఇవ్వాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. అరగంట అయినా ఆర్‌డీఓ రాకపోవడంతో అందరూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీనితో అమలాపురం – రావులపాలెం రహదారిపై ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆర్‌డీఓ శ్రీకర్ కిందకు రాగా దళిత నాయకులు తమ డిమాండ్లను ఆయనకు వివరించి, వినతిపత్రం సమర్పించారు. ఈ డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
బాధితులకు వేధింపులు
దళిత, ప్రజా సంఘాల నాయకులు విలేకరులతో మాట్లాడుతూ సామాన్య దళిత యువకులపై కొందరు కులాహంకారంతో, విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. తీవ్ర గాయాలపాలైన బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, వారిపైనే తిరిగి కేసులు (కౌంటర్ కేసులు) పెట్టి వేధించడం అత్యంత దురదృష్టకరమన్నారు. బాధితులను అదుపులోకి తీసుకున్న సమయంలో వారిపై ‘కస్టోడియల్ టార్చర్’ (పోలీస్ నిర్బంధంలో హింస) జరిగిందని, ఇది ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన యువకులకు ప్రస్తుతం అందుతున్న వైద్యం సరిపోవడం లేదని, వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలని, నిందితుల నుంచి వారికి ప్రాణహాని ఉన్నందున తగిన రక్షణ కల్పించాలని కోరారు. నిందితులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర మాల మహానాడు, దళిత, సామాజిక ప్రజా సంఘాల నాయకులు చీకరమెల్లి మంగరాజు, జక్కల అరుణ్ కుమార్, బొంతు రమణ, తొర్లపాటి సీతల్, కోనాల అంబేడ్కర్, బొంతలపల్లి శ్రీసందు, కేశరపల్లి వెంకట్రావు, సఖిలే జయప్రకాష్, కరుపోతు వెంకట్రావు, గంటి ఎంపీటీసీ సభ్యుడు ముళ్ల జనార్దనరావు, మాజీ సభ్యురాలు పోలుమాటి అంజనీకుమారి, నేరేడుమిల్లి నరేష్, వైఎన్‌వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
‘గంటి’ దళిత యువకులకు న్యాయం చేయాలి


