అనాలోచిత చర్యతో అనంత లోకాలకు..
● డివైడర్ గడ్డర్ తలకు తగిలి
ఇంటర్ విద్యార్థి మృతి
● బస్సు నుంచి తల బయటకు పెట్టడంతో ఘటన
ముమ్మిడివరం: ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్తున్న ఒక విద్యార్థి కిటికి నుంచి తల బయటకు పెట్టడంతో అన్నంపల్లి టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన డివైడర్ ఐరన్ గడ్డర్ తగిలి మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి శివారు లక్ష్మీదేవిలంకకు చెందిన సోంపల్లి వెంకట రవీంద్ర (16) అమలాపురంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రోజు ఆర్టీసీ బస్సులో అమలాపురం వెళ్లి వస్తుంటాడు. యథావిధిగా బుధవారం కాలేజికి వెళ్లడానికి లక్ష్మీదేవి లంకలో బస్సు ఎక్కిన రవీంద్ర అన్నంపల్లి టోల్ గేటు వద్ద తల బయటకు పెట్టడంతో టోల్ గేటు వద్ద ఏర్పాటు చేసిన డివైడర్ ఐరన్ గడ్డర్ ఢీకొని తలకు తీవ్రమైన గాయమైంది. దీంతో రవీంద్రను 108 అంబులెన్స్‌లో అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సోంపల్లి శ్రీనివాసరావు, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా రవీంద్ర రెండో కుమారుడు. ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు ఇక లేడన్న నిజాన్ని ఆ దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొడుకు అకస్మిక మృతితో ఆకుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మెరిట్ స్టుడెంట్‌గా..
తాను చదువుతున్న కళాశాలలో రవీంద్ర టాపర్. గతేడాది పదో తరగతి పరీక్షలలో ముమ్మిడివరం మండలం గాడిలంక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలలో 576 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. మండల స్థాయిలో తృతీయ స్థానం సాధించి డీఈఓ షేక్ సలీబాషాచే అభినందనులు అందుకున్నాడు. రవీంద్ర అకస్మిక మృతితో గ్రామంలోను కళాశాలలోను విషాదఛాయలు అలుముకున్నాయి.
అనాలోచిత చర్యతో అనంత లోకాలకు..


