చంద్రబాబు అరాచకాలపై పోరాడతాం
● ప్రజలకు అండగా నిలుస్తాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
అంబాజీపేట: పథకాల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక వారందరినీ మోసం చేసి, అరాచకాలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వంపై ధైర్యంగా పోరాటం సాగిస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ప్రజలకు న్యాయం జరిగేంతవరకూ వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. అంబాజీపేట పెద్ద వీధిలోని ఏవీఎస్, వైవీఎస్ కల్యాణ మండపంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజాసామ్యంలో అధికార పార్టీ ఆగడాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉందన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షంగా తాము అడుగుతున్న ప్రశ్నలపై సరైన సమాధానం చెప్పలేక దాడులకు తెగబడుతోందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో ఆలోచించి పెట్టిన పథకాలకు పేర్లు మార్చారే తప్ప, కొత్తగా ఒక్క పథకాన్ని కూడా రూపకల్పన చేయలేకపోయారన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూను సైతం రాజకీయం చేశారని, ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారంటూ అబద్ధాలు చెప్పారన్నారు. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతు అవశేషాలు లేవని సుప్రీంకోర్టు, సీబీఐ చెప్పినా, చివాట్లు పెట్టినా చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి రాలేదన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసినందుకు, చిత్తశుద్ధి ఉంటే రాజకీయాల నుంచి వైదొలగాలని సవాల్ విసిరారు.
కూటమి నాయకుల దుష్ప్రచారం
కూటమిలో భాగమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తయారు చేసి అమలు పరచాలని ఆదేశిస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారన్నారు. ఇందుకు కూటమి నాయకులు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం విషయానికి వస్తే అట్ట మార్చే తప్ప అవే వివరాలు ఉన్నాయన్నారు. యూరియా కొరత సృష్టించి రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇటీవల నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ప్రభుత్వ పరంగా వచ్చిన నిధులు ఎన్ని, ప్రజలు, వ్యాపారస్తుల నుంచి వసూలు చేసిన మొత్తాలను ఎంతెంత ఖర్చు చేశారో ప్రజలకు సమాధానం చెప్పమంటే దాడులు చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. పార్టీ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు కారుమూరి సునీల్ యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటం చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్, కో ఆర్డినేటర్లు గన్నవరపు శ్రీనివాసరావు, పిల్లి సూర్యప్రకాశరావు, సీజీసీ సభ్యులు పాముల రాజేశ్వరీదేవి, పేరి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కొర్లపాటి కోటబాబు, ముత్తాబత్తుల మణిరత్నం, విత్తనాల ఇంద్రశేఖర్, పాముల దేవి ప్రకాష్ పాల్గొన్నారు.


