
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తుని: చోరీ కేసును తుని పోలీసులు చేధించారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సోమవారం వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన సతీష్ (అవంతికరెడ్డి) మూడేళ్ల కిందట తుని వచ్చి హిజ్రాలతో కలసి జీవిస్తున్నాడు. ఆడ లక్షణాలు కలిగిన సతీష్ మహిళ వేషధారణలో స్థానిక జాతీయ రహదారిపై ఉంటూ పలువురిని ఆకర్షిస్తూ డబ్బులు సంపాదించేవాడు. పండగలు, జాతర్లలో నృత్యాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సతీష్‌కు ఇన్‌స్టాగామ్‌లో ప్రశాంత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరిద్దరూ తుని పట్టణం 10వ వార్డు నిమ్మకాయలవారి వీధిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. సతీష్ తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్‌ను కోరాడు. ఆపరేషన్ చేయించుకుని పూర్తి హిజ్రాగా మారితేనే పెళ్లి చేసుకుంటానని ప్రశాంత్ చెప్పాడు. దీంతో ఆపరేషన్‌కు రూ. 5 లక్షలు అవసరమని తెలుసుకున్న సతీష్, ప్రశాంత్‌లు చోరీకి వ్యూహరచన చేశారు. వారు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే నివాసం ఉంటున్న బాలేపల్లి సత్యవతి అనే వృద్ధురాలిని టార్గెట్ చేశారు. ఈ నెల 20న ఆమె తన ఇంటి వెనుక భాగంలో ఉండగా, అప్పటికే అక్కడ మాటు వేసిన సతీష్, ప్రశాంత్‌లు ఆమె కళ్లలో కారం కొట్టారు. వృద్ధురాలి మెడలో ఉన్న ఐదు గ్రాముల పగడాల బంగారు గొలుసుతో పాటు చేతికున్న నాలుగున్నర తులాల బంగారు గాజులను తీసుకుని పరారయ్యారు. సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ సీఐ గీతారామకృష్ణ సమగ్ర దర్యాప్తు జరిపి ఆదివారం స్థానిక రైల్వే గెస్ట్‌హౌస్ వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ గీతారామకృష్ణ, ఎస్సైలు విజయ్‌బాబు, పాపారావు, సిబ్బంది యాదవ్, శివయ్య, నాయుడులను డీఎస్పీ అభినందించారు.