
ఆలయాల పాలక మండళ్లకు గ్రీన్ సిగ్నల్
– నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
ఐ.పోలవరం: జిల్లాలో ప్రధాన ఆలయాల పాలక మండళ్ల నియామకానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో పాలక మండళ్ల నియామకాలుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆర్‌టీ నెం.859 జారీ చేసింది. జిల్లాలో రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల ఆదాయం పరిధిలోకి వచ్చి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం పాలకవర్గానికి దరఖాస్తులను ఆహ్వానించింది. జీవో ఆర్‌టీ నెం.861 కూడా విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లా పరిధిలో రు.కోటి నుంచి రూ.5 కోట్ల ఆదాయం పరిధిలోకి వచ్చే ఆలయాల్లో కొత్త పాలకవర్గాల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది అమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ, మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామి, మందపల్లి మందేశ్వరస్వామి ఆలయ పాలకవర్గ నియామకాలు చేపట్టనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఉత్తర్వులలో పేర్కొంది. ప్రతి ఆలయ పాలక మండలి సభ్యులలో ఒకటి బ్రాహ్మణ, ఒకటి నాయీ బ్రహ్మణ వర్గాలకు కేటాయించారు. ఆలయం ఆదాయం రూ.రెండు లక్షల లోపు ఉంటే ఆ దేవాలయానికి మొత్తం ఏడుగురు సభ్యులను నియమించనున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండాల్సి ఉంది. ఓసీ కేటగిరిలో ముగ్గురు, ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందినవారు, ముగ్గురు బీసీలకు కేటాయించారు. రూ.రెండు లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆదాయం ఉన్న ఆలయాలకు 9 మంది పాలకవర్గ సభ్యులను నియమించనున్నారు. వీరిలో నలుగురు మహిళలు, నలుగురు ఓసీలు, ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ, నలుగురు బీసీలు సభ్యులుగా ఉంటారు. రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం ఉన్న ఆలయాలకు 11 మంది సభ్యులను నియమించనున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు ఐదు ఓసీ, ఇద్దరు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందినవారు, నలుగురు బీసీలకు ఇచ్చారు. రూ.కోటి నుంచి రూ.ఐదు కోట్ల వరకు ఆదాయం ఉన్న దేవాలయాలకు సైతం ఇదే విధానాన్ని అవలంబించనున్నారు. రూ.ఐదు కోట్ల నుంచి నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఆదాయం ఉన్న ఆలయాలకు 13 మంది సభ్యులను నియమించనున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఓసీలకు 6 కేటాయించగా, ఎస్సీ ఎస్టీ వర్గాలకు రెండు, బీసీలకు 5 చొప్పున సభ్యులను కేటాయించారు. రూ.20 కోట్ల ఆదాయం దాటిన ఆలయాలకు 17 మంది సభ్యులను నియమించనున్నారు. ఎనిమిది మంది మహిళలు కాగా, ఎనిమిది మంది ఓసీలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 9 సభ్యులుగా నియమించనున్నట్టు పేర్కొన్నారు.
మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం