వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ దారుణ హత్య

YSRCP Councilor Asssinate Tragedy In Nellore - Sakshi

కిడ్నీలు, లివర్‌ భాగాల్లో పాశవికంగా పొడిచి చంపిన దుండగులు

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఘటన

సూళ్లూరుపేట(నెల్లూరు జిల్లా): సూళ్లూరుపేట పట్టణంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ తాళ్లూరు వెంకటసురేష్‌ (49) సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. కారును పార్క్‌ చేయడానికి వెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కత్తులతో పాశవికంగా పొడిచి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూళ్లూరుపేట మునిసిపాలిటీ పరిధిలోని 16వ వార్డు కౌన్సిలర్‌ అయిన వెంకటసురేష్‌ సోమవారం తన పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి సాయంత్రం సూళ్లూరుపేట చేరుకున్నారు. కుటుంబ సభ్యులను బ్రాహ్మణ వీధిలోని ఇంటివద్ద దింపిన వెంకటసురేష్‌ కారును పార్కింగ్‌ చేయడానికి పొట్టి శ్రీరాములు వీధిలోని పార్కింగ్‌ స్థలానికి వెళ్లారు.

అక్కడ నుంచి ఎంతసేపటికీ ఆయన తిరిగి రాలేదు. ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో అతని కుమారుడు ధీరజ్‌ పార్కింగ్‌ స్థలానికి వెళ్లి చూడగా.. ఒళ్లంతా కత్తిపోట్లతో కారు డ్రైవింగ్‌ సీటులో రక్తపు మడుగులో వెంకటసురేష్‌ పడి ఉన్నాడు. కారు హ్యాండ్‌ గేర్‌ వంకర్లు తిరిగిపోయి ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై ఉమాశంకర్‌ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగులు వెంకటసురేష్‌ శరీరంపై కిడ్నీలు, లివర్‌ ఉన్నచోటే అతి పాశవికంగా పొడిచినట్టుగా గుర్తించారు. వెంకటసురేష్‌కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. వెంకట సురేష్‌కు సౌమ్యుడిగా పేరుంది. ఆయనకు ఎవరితోనూ వివాదాలు గాని, రాజకీయ విభేదాలు గాని లేవని చెబుతున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు అతడిని హత్యచేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం
ఐరాల(చిత్తూరు జిల్లా): మండలంలోని వేదగిరివారిపల్లె పంచాయతీకి చెందిన గూబలవారిపల్లెలోని అటవీ ప్రాంతంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు కె.చంద్రశేఖర్‌పై హత్యాయత్నం జరిగింది. పాతకక్షల కారణంగా టీడీపీకి చెందిన అరుణ్‌నాయుడు, వేదగిరివారిపల్లె సర్పంచ్‌ రాజేంద్ర ఆదివారం సాయంత్రం నుంచి తనపై దాడి చేసేందుకు కాపు కాశారని బాధితుడు తెలిపారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తున్న తనపై కారంపొడి చల్లి ఇనుపరాడ్లతో దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారని వాపోయారు.  ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకోవడంతో టీడీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top