ప్రియుడిపై మోజుతో కాబోయే భర్తనే..

Women Assassinate Her Husband Help Of Lover In Kurnool District - Sakshi

సాక్షి, ఆళ్లగడ్డ: ప్రియుడి మోజులో పడి డిగ్రీ సెకండియర్‌ చదువుతున్న ఓ యువతి కాబోయే భర్తను హత్య చేయించింది. ప్రియుడు, మరో నలుగురు యువకుల సాయంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ముందు రోడ్డు ప్రమాదం,తరువాత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ కేసు మిస్టరీని 24 గంటలు గడవక ముందే పోలీసులు ఛేదించడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన యువతి స్థానికంగా ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ సెకండియర్‌ చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న క్లాస్‌మేట్‌తో ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు మందలించినప్పటికీ వారిలో ఏమాత్రమూ మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే తమ కుమార్తెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.  రెండు వారాల క్రితం దూరపు బంధువైన కోటకందుకూరు గ్రామానికి చెందిన ఖాజాబేగ్‌ కుమారుడు గఫార్‌బేగ్‌తో పెళ్లి నిశ్చయించారు. ఫిబ్రవరిలో పెళ్లి జరిపించాలనుకున్నారు. అయితే ఈ పెళ్లి ఏమాత్రమూ ఇష్టంలేని ఆ యువతి ఎలాగైనా గఫార్‌బేగ్‌ను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. తన ప్రియుడితో కలిసి స్కెచ్‌ వేశారు. మరో ముగ్గురి సాయం తీసుకున్నారు. 

హత్య చేసింది ఇలా.. 
కాబోయే భర్తను ఎలాగైనా అంతమొందించాలనుకున్న ఆమె అతనికి, కుటుంబ సభ్యులకు ఏమాత్రమూ అనుమానం రాకుండా పది రోజులుగా రోజూ ఫోన్‌లో ప్రేమగా మాట్లాడేది. ఇంటికి రమ్మంటూ అతన్ని కోరేది. ఈ క్రమంలోనే శనివారం బాచ్చాపురంలో గడేకారి పనికి పోయిన గఫార్‌బేగ్‌కు ఫోన్‌ చేసింది. ‘ఇంట్లో ఎవరూ లేరు. నిన్ను చూడాలనిపిస్తోంది. ఇంటికి రా’ అంటూ నమ్మ బలికింది. అతను స్వీట్లు, పండ్లు తీసుకుని వెళ్లాడు. అక్కడ సుమారు రెండు గంటలు గడిపాడు. అప్పటికే చీకటి పడడంతో ఇంటి దగ్గర వాళ్లు ఎదురు చూస్తుంటారని తన మోటార్‌ బైక్‌పై గ్రామానికి బయలుదేరాడు. అయితే అప్పటికే కోటకందుకూరు సమీపంలోకి వెళ్లి సిద్ధంగా ఉండాలంటూ ప్రియుడుతో పాటు మరో యువకుడిని బైక్‌పై పంపించింది. అతను ఏ దారిలో వెళ్తాడోనన్న అనుమానంతో మరో ఇద్దరిని ఇంకో బైకుపై అతన్ని అనుసరించేలా పంపి.. నిమిష నిమిషానికి ఫోనులో సమాచారం కనుగొంది.

గఫార్‌బేగ్‌ గ్రామ శివారులోకి వెళ్లేసరికి ముందే అక్కడ కాపు గాచిన ఆ యువతి ప్రియుడు, మరో యువకుడు బైక్‌ను అటకాయించి దాడి చేశారు. అంతలోపే వెనుక నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు కలిసి అతన్ని కత్తులతో పొడిచి చంపారు.  తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కాగా..కోటకందుకూరు సమీపాన యువకుడి మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే రాత్రి కావడంతో మృతదేహంపై కత్తిపోట్లు స్పష్టంగా కన్పించలేదు. ముందు రోడ్డు ప్రమాదమని భావించారు. తర్వాత సంఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించి..అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి కాల్‌ డేటా ఆధారంగా రేష్మను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారంతో కోటకందుకూరు మెట్టవద్ద ఉన్న శేఖర్‌ సింగ్, ఖాజీపీర్, అన్నవరం పెద్ద శ్రీనివాసులు, నాగిపోగుల చంద్రశేఖర్‌లను అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, రిమాండ్‌కు జడ్జి ఆదేశించారని డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. సమావేశంలో సీఐ సుదర్శనప్రసాద్, ఎస్‌ఐ వరప్రసాద్, హెడ్‌ కానిస్టేబుల్‌ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top