కుటుంబ సభ్యులు గోవాకు.. పెద్ద కుమార్తె ఇంటికే కన్నం

Woman Steals Jewellery In Her Own Home At Hyderabad - Sakshi

చిలకలగూడ: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే నానుడిని తిరగరాశారు చిలకలగూడ పోలీసులు. కన్న ఇంటికే కన్నం వేసి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కూతురితోపాటు ఆమెకు సహాయపడిన వ్యక్తిని  రిమాండ్‌కు తరలించారు. రూ. 5.50 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ సీఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జామై ఉస్మానియా అంబర్‌నగర్‌కు చెందిన ఇఫ్తార్‌ రాణికి అయిదుగురు కుమార్తెలు. పెద్దకుమార్తె మేరీ అలియాస్‌ మెహర్‌బేగం ప్రేమ వివాహం చేసుకుని భర్త, పిల్లలతో కలిసి బ్రాహ్మణ బస్తీలో నివసిస్తున్నారు.

ఇఫ్తార్‌రాణి తన మనవడి పుట్టినరోజు వేడుకలను గోవాలో ఘనంగా నిర్వహించాలని భావించి  కుమార్తెలు, అల్లుళ్లు, వారి పిల్లలను ఆహ్వానించారు. పెద్ద కుమార్తె మేరీ అలియాస్‌ మెహర్‌బేగం గోవాకు రానని చెప్పడంతో ఇంటికి తాళం వేసి ఇఫ్తార్‌రాణి కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 3న గోవా వెళ్లారు. ఇదే అదనుగా భావించిన పెద్ద కుమార్తె కన్న వారింట్లో చోరీ చేసేందుకు పథకం వేసింది. రామ్‌నగర్‌కు చెందిన ఇబ్రహీముద్దీన్‌ ఫరూఖీ సహాయంతో ఇంటి తాళాలు పగులగొట్టి 10 తులాల బంగారు, 70 తులాల వెండి ఆభరణాలను చోరీ చేసింది.

ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయనే సమాచారం మేరకు గోవాలో ఉన్న ఇఫ్తార్‌రాణి తన బంధువు బర్ల శ్రీకాంత్‌తో ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలించి పలు ఆధారాలు సేకరించి పెద్దకుమార్తె మేరీ అలియాస్‌ మెహర్‌బేగం నిందితురాలిగా గుర్తించారు. నిందితురాలు మెహర్‌బేగంతో పాటు ఆమెకు సహకరించిన ముషీరాబాద్‌ హరినగర్, రామ్‌నగర్‌కు చెందిన ఇబ్రహీముద్దీన్‌ ఫరూఖీను అరెస్ట్‌ చేసినట్లు సీఐ నరేష్‌ తెలిపారు.

చాకచక్యంగా వ్యవహరించి చోరీ మిస్టరీని చేధించిన చిలకలగూడ సీఐ నరేష్, డీఎస్‌ఐ సాయికృష్ణ, క్రైం కానిస్టేబుళ్లు ప్రకాశ్, మజర్, వసీ, వినయ్, ఆంజనేయులు, నాగేశ్వరరావును నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌సింగన్‌వార్, గోపాలపురం ఏసీపీ సుధీర్‌లు అభినందించి ప్రోత్సాహకాలు ప్రకటించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top