శ్రద్ధా హత్య కేసు మరవకముందే.. మరో దారుణం.. ప్రియురాలిని చంపి

West Bengal: Man Dies By Suicide on FB Live Hours After Killing Girlfriend - Sakshi

లక్నో: యావత్‌ దేశాన్ని షాక్‌ గురిచేసిన ఢిల్లీలో శ్రద్ధా దారుణ హత్య మరవక ముందే ఉత్తర ప్రదేశ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. భర్తను విడిచి వచ్చేందుకు నిరాకరించందని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు ఓ ఉన్మాది. వివాహితను హత్య చేసిన కొన్ని గంటల్లోనే సోషల్‌ మీడియాలో లైవ్‌ పెట్టి ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఈ ఘటన సిలిగురి ప్రాంతంలోని న్యూ జల్‌పైగురి పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. హత్యకు గురైన యువతిని రియా బిస్వాప్‌, నిందితుడు కిరణ్‌ దేబ్‌నాథ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

రెండేళ్లుగా రిలేషన్‌
నదియా జిల్లాకు చెందిన రియా అనే మహిళ తన భర్త రోమియో బిస్వాస్‌తో కలిసి సిలిగురిలో నివసిస్తుంది. వీరికి ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే రెండేళ్లుగా కిరణ్‌ అనే యువకుడితో రియా రిలేషన్‌షిప్‌(వివాహేతర సంబంధం) కొనసాగిస్తుంది. భర్త లేని సమయాల్లో తరుచూగా రియాను అతడు కలిసేవాడు. గత అక్టోబర్‌ ఇద్దరు కలిసి ఇంటి నుంచి పారిపోయినట్లు తెలిసింది. అయితే తర్వాత రియా తన భర్త వద్దకు తిరిగి వచ్చింది.

గొంతు కోసి
దీంతో మళ్లీ  భర్తను వదిలేసి రావాలని కిరణ్‌ వివాహితపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి రియా అంగీకరించకపోవడంతో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. పలుమార్లు దాడి చేశాడు. ఈ క్రమంలో భర్త ఇంట్లో లేని సమయంలో ఆదివారం రాత్రి కిరణ్‌ రియా ఇంటికి వెళ్లాడు. వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆవేశం పట్టలేని కిరణ్‌ అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కొసి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం పిల్లవాడు ఏడుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఇంటికి వచ్చి చూడగా రియా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ప్రియుడూ ఆత్మహత్య
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివాహిత మృతదేహాన్ని బాత్రూమ్‌లో స్వాధీనం చేసుకున్నారు. శరీరంపై కొట్టిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  మరోవైపు ప్రియురాలిని హత్య చేసిన రోజు రాత్రి.. న్యూజల్‌పైగురి రైల్వే స్టేషన్‌కు వెళ్లిన కిరణ్‌.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. చనిపోయే ముందు అతను ఫేస్‌బుక్‌ లైవ్‌ చేశాడు. 

నాకు మరో దారి లేదు
ఇందులో ‘అవును నేను రియాను చంపాను. కానీ ఆమెను చంపకుండా ఉంటే ఇలా ఆత్మహత్య చేసుకునే వాడిని కాదు. కానీ ఆమె నాకు మరో మార్గం లేకుండా చేసింది. నాకు భయంగా ఉంది. జీవించడానికి ఇంకేం లేదు.  నేను బతికితే నా జీవితాంతం జైల్లోనే గడపాల్సి వస్తుంది. అందుకే చనిపోతున్నా’ అని వీడియోలో పేర్కొన్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top