చికిత్స కోసం రూ.15 లక్షలు కట్టించుకున్నారు 

victim lodged a complaint to Commissioner of Police against Vijayawada Liberty Hospital - Sakshi

12 రోజుల తర్వాత భర్త శవాన్ని అప్పగించారు

విజయవాడ లిబర్టీ ఆస్పత్రిపై పోలీస్‌ కమిషనర్‌కు బాధితురాలు ఫిర్యాదు

విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

సాక్షి, అమరావతి బ్యూరో: మెరుగైన వైద్యం పేరిట మోసం చేసిన విజయవాడలోని లిబర్టీ ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజమండ్రికి చెందిన సరళ అనే బాధితురాలు శనివారం నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. తన భర్త వైద్య చికిత్సల కోసం మొత్తం రూ.15 లక్షలు కట్టించుకున్నారని, చివరికి ఆక్సిజన్‌ మిషన్‌ పనిచేయకపోవడం వల్లే మరణించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.  

► మాది రాజమండ్రి. నా భర్త ఆర్‌. శ్రీనివాసరావుకు జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రిలో ఈ నెల 10వ తేదీన చూపించాం. ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతున్నాయని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం అదే రోజు లిబర్టీ ఆస్పత్రిలో చేర్పించాం. 
► అక్కడ నా భర్తను డాక్టర్‌ వై.రవిప్రసాద్‌ పరీక్షించి, భయపడాల్సిందేమీ లేదని, వైద్యానికి రూ.6 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. సంపూర్ణంగా కోలుకుంటున్నారని చెబుతూనే మొత్తం రూ.15 లక్షలు కట్టించుకున్నారు.  
► ఈ నెల 21వ తేదీ రాత్రి ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడుతున్న సమయంలో ఎవరూ పట్టించుకోవడంలేదని నా భర్త చెప్పారు. దీంతో ఆయన దగ్గరే ఉంటానని నేను కరాఖండిగా చెప్పడంతో వైద్యులు అందుకు ఒప్పుకున్నారు.  
► మరుసటి రోజు రాత్రి 12 గంటల తరువాత ఒక్కసారిగా మళ్లీ ఆక్సిజన్‌ సరఫరాలో తేడా రావడంతో నా భర్త ఇబ్బంది పడ్డారు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోతుండటాన్ని గమనించి డాక్టర్‌ను పిలవాలని నర్సును కోరగా.. ఆయన వస్తున్నారంటూ కాలం వెళ్లదీశారు. తీరా మూడు గంటల తర్వాత డాక్టర్‌ వచ్చి నా భర్త చనిపోయారని తెలిపారు. 
► కరోనా బాధితులకు చికిత్స అందించే ఈ ఆస్పత్రిలో సీటీస్కాన్, ఎక్స్‌రే వంటి మిషన్లు కూడా లేవు. 
► సరైన వైద్యం అందించకుండా పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు చేసిన లిబర్టీ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి.

లిబర్టీ హాస్పిటల్‌పై విచారణకు కలెక్టర్‌ ఆదేశం
ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపేందుకు కలెక్టర్‌ ఇంతియాజ్‌ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఆదేశించారు. జిల్లా ఆస్పత్రి కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ జ్యోతిర్మణి, జిల్లా ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ సంతోష్, విజయవాడ తూర్పు తహశీల్ధారు లలితాంజలిలను విచారణ కమిటీ సభ్యులుగా నియమించారు. మృతుడి భార్య నుంచి విచారణ కమిటీ సభ్యులు మంగళవారం వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు తెలిసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top