Gachibowli Road Accident: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ గాయత్రి మృతి

Two People Deceased Due To  Road Accident At Gachibowli - Sakshi

కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై పల్టీ.. ఇద్దరు మహిళలు మృతి 

మరో యువకుడి పరిస్థితి విషమం 

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఘటన 

గచ్చిబౌలి(హైదరాబాద్‌): గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో శుక్రవారం సాయంత్రం కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కూకట్‌పల్లిలోని హెచ్‌ఎంటీ హిల్స్‌ ఆదిత్య హోమ్స్‌లో నివాసముండే దాదు వి రోహిత్‌ (25) ఎంబీఏ పూర్తి చేసిన తరువాత బియ్యం గోదాంలు నిర్వహిస్తున్నాడు.

కేపీహెచ్‌బీ కాలనీ ఈడబ్ల్యూస్‌ 1175లో నివాసముండే ఎస్‌.గాయత్రి (26) షార్ట్‌ ఫిల్మ్స్‌లో జూనియర్‌ ఆర్టిస్టు. ఇద్దరూ కలసి హోలీ వేడుకల్లో పాల్గొని సాయంత్రం విప్రో జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు కో స్పోర్ట్స్‌ కారులో వస్తున్నారు. అతివేగంగా వచ్చిన వీరి కారు ఎల్లా హోటల్‌ ముందు ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరిపడింది. ఆ దగ్గర్లోనే గార్డెనింగ్‌ పనులు చేస్తున్న మహేశ్వరి(38)ని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.


             మహేశ్వరి, గాయత్రి 

తీవ్రంగా గాయపడిన రోహిత్, గాయత్రిని గచ్చిబౌలిలోని ఏఐ జీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రోహిత్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌ను కారు ఢీ కొట్టడంతో రెండు చక్రాలు ఊడిపడ్డాయి. కారు పల్టీ కొట్టగానే అందులోంచి గాయత్రి బయట పడిపోయినట్లుగా సీసీ పుటేజీలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. 

వెంటాడిన విధి.. 
18 ఏళ్ల క్రితం నారాయణపేట జిల్లా నర్వా మండలం లంకాల గ్రామానికి చెందిన నాయకుని చిన్న రాములు, మహేశ్వరి దంపతులు గచ్చిబౌలికి వలస వచ్చారు. ఎల్లా హోటల్‌ నిర్మాణంలో కూలీగా పనిచేస్తున్న చిన్నరాములుపై 2005లో గోడ కూలడంతో అతడు చనిపోయాడు. కూతురు అనిత, కొడుకు శివరామ్‌లతో కలసి ఎల్లా హోటల్‌ సమీపంలోనే మహేశ్వరి రేకుల షెడ్డులో ఉంటూ అక్కడే గార్డెన్‌ పనులు చేస్తోంది. నిర్మాణ సమయంలో భర్త హోటల్‌ లోపల చనిపోగా, భార్య మహేశ్వరి హోటల్‌ గేట్‌ ముందే ప్రమాదంలో చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. విధి వెంటాడి తనను ఒంటరిని చేసిందని కుమారుడు శివరాం గుండెలవిసేలా విలపించాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top