అయ్యో! కొడుకా.. | Sakshi
Sakshi News home page

అయ్యో! కొడుకా..

Published Tue, Dec 29 2020 8:48 AM

Two Men Killed In Road Accident In East Godavari - Sakshi

ఆ కుటుంబాలకు ఆ యువకులే ఆధారం.. తల్లిదండ్రుల ఆశలన్నీ వారిపైనే.. ఓ యువకుడు తన స్నేహితుడితో కలసి శుభకార్యానికి వెళుతుండగా కారు అదుపుతప్పి పంట కాలువలో పడి మృత్యువాత పడితే.. మరో యువకుడు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం వద్ద, జగ్గంపేట మండలం రామవరం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. 25 ఏళ్ల యువకుల జీవితాలను చిదిమేశాయి.  

శుభకార్యానికి వెళ్లి..
మలికిపురం: సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదంలో మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామానికి చెందిన నక్కా హరీష్‌(25) అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నక్కా హరీష్‌ స్నేహితుడితో కలసి కారులో ఆదివారం రాత్రి సఖినేటిపల్లి మండలం అప్పనరాముని లంక గ్రామంలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో టేకిశెట్టిపాలెం వచ్చే సరికి కారు అదుపు తప్పి పి.గన్నవరం ప్రధాన పంట కాలువలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్‌ చేస్తున్న గుర్రం జాన్‌ వెస్లీ తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పట్టాడు. హరీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.  (చదవండి: ఉరితాడు కోసి.. ఊపిరి పోసి )

ఒక్కగానొక్క కొడుకు..
గుడిమెళ్లంక గ్రామానికి చెందిన నక్కా తులసీరావు, నాగమణికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు హరీష్‌ ఉన్నారు. సుమారు పదేళ్ల క్రితమే భర్త తులసీరావు చనిపోవడంతో నాగమణి విదేశాలకు వెళ్లి ఉపాధి పొందుతూ కుటుంబ పోషణ చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసింది. కుమారుడు హరీష్‌ను ఎంసీఏ చదివించింది. భర్త చని పోయినా కుమారుడు కుటుంబానికి అండగా ఉంటాడని ఆశ పడిన ఆ తల్లి ఆశలు అడియాసలయ్యాయి. కుమారుడు మరణ వార్త తెలుసుకున్న నాగమణి కువైట్‌ నుంచి దుఃఖంతో స్వస్థలం బయల్దేరింది. 

కాలువలో పడిన కారు మృతుడు  నక్కా హరీష్‌ 

రామవరంలో కారు ఢీకొని..
జగ్గంపేట: జాతీయ రహదారి–16పై జగ్గంపేట శివారు భగత్‌సింగ్‌ నగర్‌ వద్ద కారు ఢీ కొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. జగ్గంపేట ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళుతున్న కియో కారు జగ్గంపేట శివారు భగత్‌ సింగ్‌ నగర్‌ వద్దకు వచ్చేసరికి మోటారు సైకిల్‌పై రోడ్డు దాటుతున్న రామవరానికి చెందిన ఏడాకుల మధుబాబు(25)ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్‌ నుజ్జునుజ్జుయ్యి, కారు ముందుభాగం కూడా బాగా దెబ్బతింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి జగ్గంపేట ఎస్సై రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై కేసు నమోదు చేశారు. 

కుటుంబానికి అతడే ఆధారం  
మధుబాబు ట్రాక్టర్‌ డ్రైవర్‌. కుటుంబానికి అతడే ఆధారం. టవర్‌ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మధుబాబు తల్లితోపాటు టవర్‌ కాలనీలో నివాస ముంటున్నాడు. అతడి తండ్రి హైదరాబాద్‌లో చిన్న కంపెనీలో చిరు ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడి మధుబాబే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వివాహం చేయాలని భావిస్తున్న తరుణంలో మృత్యువాత పడ్డాడని కుటుంబ సభ్యులు బోరున విలపించడం అందరిని కలిచివేసింది. రోజు ట్రాక్టర్‌ పై వెళ్లే వాడని, ఈ రోజు పనిలేదని తిరిగి వచ్చి జగ్గంపేట వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు విలపించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement